పాకిస్థాన్‌కు గూఢ‌చ‌ర్యం.. జ‌మ్మూకశ్మీర్‌లో సైనికుడి అరెస్ట్‌

  • పంజాబ్‌ సంగ్రూర్ జిల్లాలోని నిహ‌ల్‌గ‌ఢ్ గ్రామానికి చెందిన దేవీంద‌ర్‌ అరెస్ట్ 
  • జ‌మ్మూకశ్మీర్‌లోని ఉరిలో జ‌వానుగా ప‌నిచేస్తున్న దేవీంద‌ర్‌
  • గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల కేసులో ఇటీవ‌ల మాజీ సైనికుడు గుర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్ 
  • అత‌డిని విచారించ‌గా ఈ దేవీంద‌ర్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింద‌న్న‌ పోలీసులు
దాయాది పాకిస్థాన్‌కు గూఢ‌చ‌ర్యం చేస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌పై ఓ సైనికుడిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లా ప‌రిధిలోని నిహ‌ల్‌గ‌ఢ్ గ్రామానికి చెందిన దేవీంద‌ర్‌ను అరెస్ట్ చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. అత‌డు జ‌మ్మూకశ్మీర్‌లోని ఉరిలో జ‌వానుగా ప‌నిచేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 

గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల కేసులో ఇటీవ‌ల మాజీ సైనికుడు గుర్‌ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అత‌డిని విచారించ‌గా ఈ దేవీంద‌ర్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఇద్ద‌రు పుణెలోని ఆర్మీ క్యాంప్‌లో మొద‌టిసారి క‌లిశార‌ని, ఆ త‌ర్వాత జ‌మ్మూకశ్మీర్‌, సిక్కింల‌లో క‌లిసి ప‌నిచేసిన‌ట్లు వివ‌రించారు. 

స‌ర్వీస్ స‌మ‌యంలో భార‌త ఆర్మీకి సంబంధించిన సున్నిత‌మైన స‌మాచారాన్ని గుర్‌ప్రీత్ సింగ్ లీక్ చేశాడ‌ని పోలీసులు తెలిపారు. ఆ స‌మాచారం తాలూకు పత్రాల సేక‌ర‌ణ‌కు దేవీంద‌ర్ స‌హ‌క‌రించిన‌ట్లు త‌మ ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో తేలింద‌న్నారు. దాంతో దేవీంద‌ర్‌ను అదుపులోకి తీసుకుని మొహాలీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. అనంత‌రం రిమాండ్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం గూఢ‌చ‌ర్యంలో నిందితుడి పాత్ర‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.    




More Telugu News