దొంగతనం చేస్తూ దొరికిన భారత మహిళ.. అమెరికా ఎంబసీ తీవ్ర హెచ్చరిక

  • ఓ స్టోర్‌లో దొంగతనం చేస్తూ దొరికిన మహిళ
  • ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే వీసా రద్దు అవుతుందని హెచ్చరిక
  • భవిష్యత్తులోనూ వీసాకు దరఖాస్తు చేసుకోలేరన్న యూఎస్ ఎంబసీ
అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయులకు యూఎస్ ఎంబసీ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. అమెరికాలో దాడి, దొంగతనం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే.. అది చట్టపరమైన సమస్యలను సృష్టించడమే కాకుండా వీసా రద్దు కావడంతోపాటు భవిష్యత్తులోనూ వీసా అనర్హతకు దారితీస్తుందని హెచ్చరించింది. 

భారతీయ మహిళ ఒకరు ఓ షాప్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో యూఎస్ ఎంబసీ ఈ హెచ్చరిక జారీచేసింది. వైరల్ అయిన ఆ వీడియోలో టార్గెట్ స్టోర్‌లో దొంగతనం చేస్తూ ఆమె పట్టుబడింది. దాదాపు లక్ష రూపాయల (1000 డాలర్లు) విలువైన వస్తువులను దొంగిలించేందుకు ప్రయత్నించినట్టు వీడియోలో కనిపించింది. తాను దొంగిలించిన వాటికి డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని, తనను విడిచిపెట్టాలని ఆ మహిళ పోలీసులను వేడుకోవడం కనిపించింది. స్పందించిన పోలీసు అధికారి మీరు స్టోర్ నుంచి బయటకు వెళ్లకపోతే డబ్బులు చెల్లించే అవకాశం ఉండేదని, కానీ, వెళ్లిపోయారని చెప్పాడు. ఇప్పుడు ఈ తప్పును సరిచేయలేమని ఆయన స్పష్టంగా చెప్పేశారు.

కాగా, ఇటీవల భారతీయ విద్యార్థి ఒకరు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి దొరికిపోయి బహిష్కరణకు గురయ్యాడు. దీంతో అక్రమ ప్రవేశాలపై యూఎస్ రాయబార కార్యాలయం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. యూఎస్ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను కూడా పరిశీలించాలని నిర్ణయించింది. ఇక, తాజా ఘటనతో చిన్నచిన్న దొంగతనాలు సైతం వీసా రద్దుకు, భవిష్యత్తులో వీసా దరఖాస్తులపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తాజా ఘటన నిరూపించింది. 


More Telugu News