భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత‌

  • గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు
  • ఇవాళ పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత‌
  • అమర్‌నాథ్ యాత్రను గురువారం నిలిపివేసినట్లు జమ్మూ కశ్మీర్ సమాచార శాఖ ప్రకటన‌
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్ యాత్రను గురువారం నిలిపివేసినట్లు జమ్మూకశ్మీర్ సమాచార శాఖ ప్రకటించింది.

కుండపోత వర్షం కారణంగా ప్రభావితమైన యాత్రా స్థలాలలో అధికారులు అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేప‌థ్యంలో యాత్రను ఒక‌రోజు నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

"గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కార‌ణంగా రెండు మార్గాల్లోని ట్రాక్‌లపై పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో గురువారం రెండు బేస్ క్యాంపుల నుంచి యాత్రను నిలిపివేయ‌డం జ‌రిగింది" అని జమ్మూకశ్మీర్ ప్రజా సంబంధాల విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి కూడా సస్పెన్షన్‌ను ధ్రువీకరించారు. వాతావరణ పరిస్థితులను బట్టి రేపు యాత్ర తిరిగి ప్రారంభమవుతుందని తెలిపారు.

"గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా, ట్రాక్‌లపై అత్యవసర మరమ్మతులు మరియు నిర్వహణ పనులు చేపట్టాల్సి ఉంది. అందువల్ల, ఈ రోజు రెండు బేస్ క్యాంపుల నుంచి యాత్ర‌కు అనుమతించకూడదని నిర్ణయించారు" అని ఆయన అన్నారు.

ఇక‌, ఈ నెల‌ 3న తీర్థయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి 2.35 లక్షలకు పైగా యాత్రికులు పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. అలాగే ఇప్పటివరకు 4 లక్షలకు పైగా భక్తులు తీర్థయాత్ర కోసం ఆన్‌లైన్‌లో త‌మ పేర్ల‌ను నమోదు చేసుకున్నారు. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9న ముగుస్తుంది.


More Telugu News