మా కూటమి గెలుస్తుంది.. నేనే ముఖ్యమంత్రిని అని బీజేపీ చెప్పింది: పళనిస్వామి

  • వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • గెలిచిన కూటమికి తమ పార్టీయే నాయకత్వం వహిస్తుందన్న పళనిస్వామి
  • అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ, అన్నాడీఎంకే
తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని, తానే ముఖ్యమంత్రి అవుతానని బీజేపీ స్పష్టం చేసిందని అన్నాడీఎంకే నాయకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు.

తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నందున బీజేపీకి అన్నాడీఎంకే ఒక షరతు విధించింది. ఎన్నికల్లో గెలిస్తే తమ పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీకి స్పష్టం చేసింది.

ఈ క్రమంలో పళనిస్వామి మాట్లాడుతూ, కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమికి తమ పార్టీనే నాయకత్వం వహిస్తుందని ఆయన అన్నారు. ఇది తన నిర్ణయమని కూడా పేర్కొన్నారు. తానే ముఖ్యమంత్రి అవుతానని బీజేపీ కూడా ప్రకటించిందని వెల్లడించారు. అంతకుమించి ఇంకేం కావాలని ఆయన ప్రశ్నించారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి పోటీ చేశాయి. అయితే జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే తాము ఎన్డీయేలో ఉండబోమని 2023లో అన్నాడీఎంకే ప్రకటించింది. గత లోక్ సభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీ చేయడం వల్ల డీఎంకేకు లాభం చేకూరింది. ఇటీవల అన్నామలైని సారథ్య బాధ్యతల నుంచి తొలగించిన బీజేపీ, అన్నాడీఎంకేతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకుంది.


More Telugu News