ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్ ఇది..!

  • స్పెయిన్‌లో ఒక బ్లూ చీజ్‌కు వేలంలో అత్యంత భారీ ధ‌ర‌
  • సుమారు రూ. 36 లక్షలు ధ‌ర పలికిన వైనం
  • ధ‌ర‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కిన చీజ్ బరువు దాదాపు 2.3 కిలోలు
స్పెయిన్‌లో ఒక బ్లూ చీజ్ వేలంలో అత్యంత భారీ ధ‌ర‌కు అమ్ముడైంది. దీంతో ఇప్పటివరకు అమ్ముడైన అత్యంత ఖరీదైన చీజ్‌గా నిలిచింది. దీని ధర 36,000 యూరోలు (సుమారు రూ. 36 లక్షలు) పలికింది. ధ‌ర‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కు ఎక్కిన ఈ చీజ్ బరువు దాదాపు 2.3 కిలోలు. ఈ చీజ్ త‌యారీకి ఆవు పాలను ఉప‌యోగించ‌డంతో పాటు సముద్ర మట్టానికి దాదాపు 1,500 మీటర్ల ఎత్తులో ఉన్న లాస్ మాజోస్ గుహలో 10 నెలలు పరిపక్వం చెందే వరకు ఉంచారు. 

ఈ గుహ సాంప్రదాయకంగా కాబ్రేల్స్ చీజ్‌ను పాతబడటానికి ఉపయోగిస్తారు. ఇక‌, ఈ గుహ చీజ్‌కు దాని ప్రత్యేకమైన ఆకుపచ్చ-నీలం రంగు, ఉప్పగా ఉండే రుచిని ఇస్తుంది. దీనిని ఏంజెల్ డియాజ్ హెర్రెరో జున్ను ఫ్యాక్టరీ త‌యారు చేసింది. అలాగే 2024 ఆగస్టు 25న స్పెయిన్‌లోని అస్టురియాస్‌లోని కాబ్రేల్స్‌లో జరిగిన వేలంలో రెగ్యులేటరీ కౌన్సిల్ డీఓపీ కాబ్రేల్స్ (స్పెయిన్) ద్వారా విక్రయించడం జ‌రిగింది.

స్పెయిన్ అంతటా తొమ్మిది క్యాటరింగ్ సంస్థలు ఈ బ్లూ చీజ్ కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. వేలం 3,000 యూరోలతో ప్రారంభమైంది. మొత్తం 40 బిడ్‌లు దాఖలయ్యాయి. ఘాటైన వాసన, బలమైన రుచులకు పేరుగాంచిన ఈ చీజ్‌ ను చివరికి స్పెయిన్‌లోని అస్టురియాస్‌లోని ఎల్ లగార్ డి కొలోటో రెస్టారెంట్ యజమాని ఇవాన్ సువారెజ్ కొనుగోలు చేశారు. 


More Telugu News