గిల్‌కు బదులు కోహ్లీ ఆడి ఉంటే సెంచరీ చేసేవాడు: మంజ్రేకర్

  • గిల్ అనవసర దూకుడు కట్టిపెట్టాలన్న మంజ్రేకర్
  • విరాట్ కోహ్లీలా ఒక బ్రాండ్‌గా మారే ప్రయత్నం చేయొద్దని హితవు
  • తన బ్యాటింగ్‌పై దృష్టిపెట్టాలన్న మాజీ క్రికెటర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అనవసరమైన దూకుడును విడిచిపెట్టి, విరాట్ కోహ్లీలా ఒక బ్రాండ్‌గా మారే ప్రయత్నం చేయకుండా, తన ఆటపై దృష్టి సారించాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలీతో గిల్ వాగ్వివాదానికి దిగడం జట్టు ఓటమికి కారణమైందని విమర్శలు వచ్చాయి. ఈ  నేపథ్యంలో మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గిల్, క్రాలీ మధ్య జరిగిన వాగ్వాదం ఇంగ్లండ్ జట్టును ఉత్తేజపరిచి, కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు ప్రేరణగా నిలిచిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. "శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లీలా ఒక బ్రాండ్‌గా మారే ప్రయత్నం చేయకుండా, అనవసరమైన దూకుడును వదిలి, తన బ్యాటింగ్, కెప్టెన్సీపై దృష్టి పెట్టాలి" అని చెప్పుకొచ్చాడు. గిల్ దూకుడు వైఖరి జట్టుకు వ్యతిరేకంగా పనిచేసిందని,  ఆటగాళ్లు శాంతంగా ఆడాల్సిన సమయంలో ఇటువంటి వివాదాలు నష్టం కలిగిస్తాయని అన్నాడు.

మంజ్రేకర్ మాట్లాడుతూ "గిల్ ఒక అద్భుతమైన ఆటగాడు. కానీ కెప్టెన్‌గా అతడు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. విరాట్ కోహ్లీ దూకుడు అతడి ఆటలో ఒక భాగం. అది అతనికి సహజంగా వచ్చింది. అతడు ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే, శత్రువుల ముఖంలోకి చూసి సెంచరీ కొట్టి ఉండేవాడు. గిల్ ఈ సిరీస్‌లో 269 పరుగులు సహా మూడు సెంచరీలతో బ్రాడ్‌మన్‌లా ఆడాడు. అయితే, తాజా మ్యాచ్‌లో 9 బంతుల్లో 6 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ దూకుడు అతని సహజ శైలి కాదని స్పష్టం చేస్తుంది" అని మంజ్రేకర్ వివరించాడు.


More Telugu News