గోవా గుహలో బిడ్డకు జన్మనిచ్చిన రష్యన్ మహిళ.. ఆమె భర్త ఓ వ్యాపారవేత్త

  • ఇద్దరు కుమార్తెలతో కలిసి కర్ణాటకలోని గోకర్ణలోని ఓ గుహలో మహిళ నివాసం
  • ఇటీవల ఆమెను గుర్తించి అక్కడి నుంచి తరలించిన పోలీసులు
  • 2016లో వ్యాపార వీసాపై భారత్‌కు 
  • 15 సంవత్సరాల్లో 20 దేశాలను చుట్టేసిన మహిళ
  • ప్రస్తుతం పిల్లలతో కలిసి కర్వార్‌లోని మహిళల రక్షణ కేంద్రంలో ఉంటున్న నీనా
కర్ణాటక గోకర్ణ సమీపంలోని రామతీర్థ కొండల్లో ఒక గుహలో రష్యన్ మహిళ నీనా కుటీనా (40) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవిస్తున్న ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. జులై 11న స్థానిక పోలీసులు ఈ కుటుంబాన్ని గుహ నుంచి సురక్షితంగా రక్షించారు. తాజాగా నీనాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఇద్దరు కుమార్తెలు ప్రేయా (6), ఆమా (4)లలో ఒకరు గోవాలోని గుహలో జన్మించినట్టు నీనా తాజాగా వెల్లడించింది. నీనా భర్త ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కావడం గమనార్హం.

2016లో వ్యాపార వీసాపై భారత్‌కు వచ్చిన నీనా.. గోవా, గోకర్ణలోని పర్యాటక రంగంపై ఆసక్తి చూపించింది. 2017లో ఆమె వీసా గడువు ముగిసిన తర్వాత 2018లో గోవాలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్‌వో) నుంచి ఎగ్జిట్ పర్మిట్ పొందింది. ఆ తర్వాత తాత్కాలికంగా నేపాల్‌కు వెళ్లింది. అనంతరం మళ్లీ భారతదేశానికి తిరిగి వచ్చి, కర్ణాటక తీరంలోని అడవుల్లో జీవనం సాగించింది. గత 15 సంవత్సరాల్లో ఆమె సుమారు 20 దేశాలను సందర్శించినట్టు తెలిసింది. 

రామతీర్థ కొండల్లోని గుహలో నీనా, ఆమె కుమార్తెలు దాదాపు రెండు వారాలు ఒంటరిగా గడిపారు. ఈ గుహ ప్లాస్టిక్ షీట్లతో కప్పబడి, దేవతల చిత్రాలతో అలంకరించబడింది. నీనా తన జీవనశైలిని సమర్థిస్తూ ప్రకృతితో కలిసిజీవించామని, తన పిల్లలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారని తెలిపింది. "మేము గుహలో మరణించడానికి రాలేదు. ప్రకృతితో జీవించడంలో మాకు అనుభవం ఉంది. నా పిల్లలు ఎప్పుడూ అనారోగ్యానికి గురి కాలేదు. ఇప్పుడే వారు మొదటిసారి ఆసుపత్రికి వెళ్లారు" అని ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.  

నీనా తన జీవనోపాధి కోసం కళాకృతులు సృష్టించడం, సంగీత వీడియోలు తయారు చేయడం, బోధన లేదా బేబీసిటింగ్ వంటి చిన్న ఉద్యోగాలు చేస్తూ ఆదాయం పొందినట్టు తెలిపింది. గుహలో జీవితం శాంతియుతమని, పాములను ‘స్నేహితులు’గా భావించినట్టు ఆమె చెప్పింది. అయితే, ఈ ప్రాంతంలో కొండచరియల ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించి, నీనాను గుహ నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 

ప్రస్తుతం నీనా, ఆమె కుమార్తెలు కర్వార్‌లోని మహిళల రక్షణ కేంద్రంలో ఉన్నారు. అధికారులు వారిని రష్యాకు తిరిగి పంపే ప్రక్రియను ప్రారంభించారు, ఇది ఒక నెల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. నీనా తన జీవితంలో ఒక కుమారుడిని కోల్పోయిన బాధను పంచుకుంటూ, ఆ సంఘటన తర్వాత గోకర్ణలో జీవనం ప్రారంభించినట్టు తెలిపింది.ఈ ఘటన స్థానికంగా, సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.


More Telugu News