సత్యజిత్ రే ఇంటిని కూల్చొద్దు.. బంగ్లాదేశ్‌కు భారత్ విజ్ఞప్తి

  • శిథిలావస్థలో సత్యజిత్ రే ఇల్లు
  • కూల్చివేయాలని నిర్ణయించిన బంగ్లాదేశ్
  • మరమ్మతులకు అవసరమైన నిధులు, సహకారం అందిస్తామన్న భారత్
  • ఇప్పటి వరకు స్పందించని బంగ్లాదేశ్ ప్రభుత్వం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని లెజెండరీ చలనచిత్ర దర్శకుడు సత్యజిత్ రే ఇంటిని కూల్చివేసే నిర్ణయాన్ని పునరాలోచించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ చారిత్రక భవనానికి మరమ్మతు చేయడానికి అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించింది. 

భారత సినీ చరిత్రలో సత్యజిత్‌ రే ప్రముఖ దర్శకుడిగా పేరు గాంచారు. ఢాకాలోని గరీబ్-ఎ-నవాజ్ అవెన్యూలో ఉన్న తన నివాసంలో ఆయన ఎక్కువ కాలం గడిపారు. ఈ ఇల్లు ఆయన సినిమా సృజనాత్మకతకు సాక్షిగా నిలిచింది. అయితే, ఈ భవనం పాతబడి, శిథిలావస్థకు చేరుకోవడంతో దానిని కూల్చివేసి, ఆ స్థలంలో కొత్త నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.  

సత్యజిత్ రే ఇంటిని కూల్చివేస్తారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ.. సత్యజిత్ రే ఇల్లు కేవలం ఒక భవనం మాత్రమే కాదని, భారత్, బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక వారసత్వానికి చిహ్నమని పేర్కొంది. "సత్యజిత్ రే ఒక అంతర్జాతీయ సినిమా ఐకాన్. ఆయన ఇల్లు ఒక చారిత్రక స్థలం, దానిని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ భవనాన్ని పునరుద్ధరించడానికి భారత్ పూర్తి సహాయం అందిస్తుంది" అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ విషయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ఈ ఇంటిని సాంస్కృతిక వారసత్వ స్థలంగా మార్చేందుకు సాంకేతిక నిపుణులను, నిధులు అందజేస్తామని సూచించింది. 'పథేర్ పాంచాలి', 'అపరాజితో', 'ప్రతిద్వంద్వి' వంటి సత్యజిత్ రే చిత్రాలు బెంగాలీ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. ఇవి బంగ్లాదేశ్‌లోనూ విశేష ఆదరణ పొందాయి.

బంగ్లాదేశ్‌లోని సాంస్కృతిక సంస్థలు, సినిమా ప్రేమికులు కూడా ఈ ఇంటిని కాపాడాలని కోరుతున్నారు. "సత్యజిత్ రే ఇల్లు కేవలం ఒక భవనం కాదు, అది మా సాంస్కృతిక గుండె. దానిని కూల్చడం అంటే చరిత్రను తుడిచివేయడమే" అని ఢాకాలోని ఒక సినిమా విమర్శకుడు అభిప్రాయపడ్డారు. 

ఈ విషయంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, భారత్ ప్రతిపాదన రెండు దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సత్యజిత్ రే ఇంటిని సాంస్కృతిక కేంద్రంగా మార్చడం ద్వారా, రే సినిమాలు, ఆయన వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించవచ్చని వారు సూచిస్తున్నారు.


More Telugu News