Indian Food: వీధి ఆహార సంస్కృతిని లక్ష్యంగా చేసుకోలేదు.. డిజిటల్ బోర్డు వార్తలపై కేంద్రం క్లారిటీ

Indian Food Center clarifies on Samosa Jalebi health advisory
  • డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ వచ్చిన వార్తలు అవాస్తవమన్న కేంద్రం 
  • సిగరెట్ పెట్టెలపై ఉన్నట్లుగా హెచ్చరికలు ఉండాలని కేంద్రం నిర్ణయించిందనడంలో వాస్తవం లేదన్న పీఐబీ ఫ్యాక్ట్ చెక్ 
  • ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్లు వెల్లడి
భారతీయ ప్రసిద్ధ వంటకాలైన సమోసా, జిలేబీ, వడాపావ్ తదితర వంటకాల్లో చక్కెర, నూనె శాతాన్ని డిస్‌ప్లే చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు సోమవారం వార్తలు వచ్చిన విషయం విదితమే. పాఠశాలలు, కార్యాలయాలు, సమావేశ మందిరాలు తదితర ప్రదేశాల్లో విక్రయించే సమోసా, జిలేబీ లాంటి ఆహార పదార్థాల్లో పంచదార, నూనె శాతాన్ని తెలిపే డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరిగింది.

అయితే, దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న కేంద్రం వివరణ ఇచ్చింది. సిగరెట్ పెట్టెలపై ఉన్నట్లుగా హెచ్చరికలు ఉండాలని కేంద్రం నిర్ణయించిందనడంలో వాస్తవం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్టు కేంద్రం వివరణ ఇచ్చింది.

వీధి ఆహార సంస్కృతిని కేంద్రం లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేసింది. ప్రత్యేకంగా వంటకాల పేర్లను ప్రస్తావించలేదని తెలిపింది. మెరుగైన ఆహారాన్ని, జీవనశైలిని ప్రోత్సహించేందుకు కేంద్రం సాధారణ ఆరోగ్య సలహా ఇచ్చింది తప్ప ఏ ఆహార పదార్థాలను లక్ష్యంగా చేసుకోలేదని పేర్కొంది. 
Indian Food
Samosa
Jalebi
Vada Pav
Food Safety
Ministry of Health
PIB Fact Check
Street Food
Health Advisory

More Telugu News