Reham Khan: కొత్త పార్టీ ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

Reham Khan Announces New Political Party
  • పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీని ప్రారంభించిన ఇమ్రాన్ ఖాన్ మాజీ అర్ధాంగి రెహమ్ ఖాన్
  • సొంతంగా రాజకీయాల్లోకి వచ్చానన్న రెహమ్ ఖాన్
  • మార్పు కోసమే తమ పార్టీ పని చేస్తుందన్న రెహమ్ ఖాన్
పాకిస్థాన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ మాజీ అర్ధాంగి రెహమ్ ఖాన్ రాజకీయ పార్టీని ప్రకటించారు. ప్రజల సమస్యలను లేవనెత్తడంలో సామాన్యుడి గొంతుకగా నిలబడేందుకు ‘పాకిస్థాన్ రిపబ్లిక్ పార్టీ’ని ప్రారంభించినట్లు రెహమ్ తెలిపారు.

తాను గతంలో ఎప్పుడూ రాజకీయ పదవులు చేపట్టలేదని పేర్కొన్న ఆమె, ఒకసారి ఒక వ్యక్తి (ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశిస్తూ) కోసం పార్టీలో చేరానని చెప్పారు. కానీ ఈ రోజు తాను సొంతంగా రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. ఇది కేవలం పార్టీ మాత్రమే కాదని, రాజకీయాలను సేవగా మార్చే ఉద్యమమని తెలిపారు.

ప్రస్తుతం దేశ రాజకీయాలపై ప్రజల్లో పెరుగుతున్న నిరాశ, నిస్పృహ కారణంగా తాను పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. కరాచీ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. కష్టకాలంలో ఈ ప్రదేశం తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.

2012 నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో తాగునీరు, కనీస వసతులు కరవయ్యాయని రెహమ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తనకు అధికారం చేపట్టడం ముఖ్యం కాదని, మార్పు కోసమే తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. కుటుంబ రాజకీయాలపై ఆమె విమర్శలు గుప్పించారు. ఎవరి మద్దతు లేకుండానే తమ పార్టీని ఏర్పాటు చేశామని తెలిపారు. పార్టీ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని రెహమ్ ఖాన్ ప్రకటించారు. 
Reham Khan
Pakistan Republic Party
Imran Khan
Pakistan Politics
Political Party
Reham Khan Party
Karachi Press Club
Pakistan News
Pakistani Politics
New Political Party

More Telugu News