Chandrababu Naidu: సీమకు జలసిరులు... ఈ నెల 17న నీటిని విడుదల చేయనున్న చంద్రబాబు

Chandrababu Naidu to Release Water for Handri Neeva Project on 17th
  • హంద్రీనీవా ఫేజ్-1 కాలువల సామర్థ్యం పెంపు
  • శరవేగంగా పనులు పూర్తి 
  • 100 రోజుల్లోనే కాలువ విస్తరణ
హంద్రీనీవా ఫేజ్-1 కాలువల సామర్థ్యం పెంపుతో రాయలసీమలో తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం వంద రోజుల్లోనే ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న వేగవంతమైన నిర్ణయాలు, చూపిన చొరవ ఫలితంగా రాయలసీమకు జలసిరులు అందనున్నాయి. హంద్రీనీవా ఫేజ్-1 కాలువల విస్తరణ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో సీమ జిల్లాలు సస్యశ్యామలం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 17వ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద విస్తరణ పూర్తైన హంద్రీనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా వంద రోజుల్లోనే ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని పూర్తి చేసింది.

పరుగులు తీసిన ప్రాజెక్టు పనులు

రూ.696 కోట్లతో చేపట్టిన ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్-1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరిగింది. రాయలసీమకు తాగు, సాగునీరు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫేజ్-1, ఫేజ్-2 కాలువ పనులను పరుగులు పెట్టించారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం ఫేజ్-1 కాలువ విస్తరణతో అదనంగా 1,600 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఏర్పడింది. దీనితో జీడిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి సామర్థ్యంతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందనుంది.

12 ఏళ్ల తర్వాత 40 టీఎంసీల వినియోగం

మల్యాల నుంచి జీడిపల్లి వరకు 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి కావడంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా రాయలసీమ జిల్లాల్లోని స్థానిక చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గతంలో హంద్రీనీవా ఫేజ్-1 కాలువ పూర్తి సామర్థ్యం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండటంతో కేవలం 1-2 సార్లు మాత్రమే వరద సమయంలో 40 టీఎంసీల నీటిని వినియోగించుకున్నారు. ఇప్పుడు కాలువల సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరగడంతో, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం మేరకు 40 టీఎంసీల వరద జలాలను ఈ ఏడాదిలో రాయలసీమ జిల్లాలకు వినియోగించుకునే అవకాశం కలిగింది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునే అవకాశం ఈ విస్తరణ పనుల ద్వారా ఏర్పడింది.

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీరు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల తాగు, సాగునీటి కష్టాలను తీర్చనుంది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-1 ద్వారా నంద్యాల జిల్లాలో 2,906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఫేజ్-2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందనుంది. మొత్తంగా ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది.

కూటమి ప్రభుత్వంతోనే మళ్లీ పనులు

2014-19 మధ్య రూ.4,317 కోట్లతో పాలనానుమతులు ఇచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం హంద్రీనీవా కాలువల విస్తరణ పనులను 47 శాతం మేర పూర్తి చేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2025 ఏప్రిల్‌లో మొదలైన విస్తరణ పనులు కేవలం వంద రోజుల్లో పూర్తయ్యాయి. తదుపరి ఫేజ్-2 పనులను కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం రూ.3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

ఈ ప్రాజెక్టు పూర్తి కావడంతో రాయలసీమలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కారమై, ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించేందుకు ఇది ఒక ముందడుగు అని చెప్పవచ్చు.


Chandrababu Naidu
Handri Neeva Project
Rayalaseema Irrigation
Andhra Pradesh Water Resources
Nandyal District
Irrigation Project AP
TDP Government
Jalasi Rulu
AP Irrigation Projects
Water Release

More Telugu News