B Tech Students: బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ చూసి దొంగలయ్యారు!

B Tech Students Arrested for Bike Theft in Andhra Pradesh
  • ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేసిన అద్దంకి పోలీసులు
  • బైక్ లు చోరీ చేస్తున్న విద్యార్థులు
  • ఏకంగా 16 బుల్లెట్ బైకుల చోరీ
బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను బాపట్ల జిల్లా అద్దంకి పోలీసులు అరెస్టు చేశారు. ఈ విద్యార్థులు బైక్ దొంగతనం గ్యాంగ్‌గా వ్యవహరిస్తూ వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. వీరు చోరీ చేసిన వాహనాల్లో ఏకంగా 16 బుల్లెట్ బండ్లు ఉండడం గమనార్హం. వీరంతా యూట్యూబ్ చూసి దొంగతనాల్లో నైపుణ్యం సంపాదించారట. అద్దంకి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా జరిపిన విచారణలో వీరి నేర చరిత్ర బయటపడింది.

పోలీసుల విచారణలో, ఈ విద్యార్థులు కొంతకాలంగా బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. వీరు అద్దంకితో పాటు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకున్నారు. రాత్రివేళల్లో జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో బైక్‌లను దొంగిలించి, వాటిని అమ్మకం చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన విద్యార్థుల నుంచి పోలీసులు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలు వివిధ బైక్ దొంగతనం కేసులకు సంబంధించినవని అధికారులు ధృవీకరించారు. టవర్ డంప్ టెక్నాలజీ ద్వారా ఈ బైక్ దొంగల ఆచూకీ తెలుసుకున్నామని జిల్లా ఎస్పీ తుషార్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఆరుగురు విద్యార్థులు ఒంగోలులో, మరొకరు కందుకూరులో చదువుతున్నారు.

ఓ కళాశాల యాజమాన్యం ఈ ఘటనపై స్పందిస్తూ, విద్యార్థులు విద్యాసంస్థ వెలుపల చేసిన చర్యలకు తాము బాధ్యత వహించలేమని తెలిపింది. పోలీసులు ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ గ్యాంగ్‌లో మరికొందరు సభ్యులు ఉన్నారా, లేదా వీరు ఇతర నేరాలకు కూడా పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
B Tech Students
Bike Theft
Andhra Pradesh Crime
Bapatla District
Youtube Crime
Engineering Students Arrested
Tushar IPS
Addanki Police
Bullet Bikes Theft

More Telugu News