పదే పదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం ప్రోస్టేటైటీస్‌ కు సంకేతం కావొచ్చు!

  • మూత్రనాళ ఇన్ఫెక్షన్ కారణంగానే ఎక్కువగా సోకుతుందంటున్న వైద్యులు
  • ప్రోస్టేటైటీస్ గురించి చాలామందికి తెలియదని వెల్లడి
  • అవగాహనలోపం వల్ల సమస్య తీవ్రమవుతోందని హెచ్చరిక 
పురుషుల్లో తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావడం ప్రోస్టేటైటీస్ కు సంకేతం కావొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూత్ర విసర్జన చేసి వచ్చినా ఇంకా పూర్తిగా చేయలేదని అనిపిస్తే అప్రమత్తం కావాల్సిందేనని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది పురుషులు ప్రోస్టేటైటీస్ తో ఇబ్బంది పడుతున్నారని హైదరాబాద్ లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యురాలజీ (ఏఐఎన్‌యూ) వైద్య నిపుణుడు డాక్టర్ దీపక్‌ రాగూరి చెప్పారు. 30 నుంచి 50 ఏళ్లలోపు వయసున్న పురుషులలో పది శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఇటీవలి పరిశోధనలో తేలిందన్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరగడంపై జనాలలో చాలామందికి అవగాహన ఉందని, ప్రోస్టేటైటీస్ గురించి మాత్రం ఎక్కువమందికి తెలియదని డాక్టర్ దీపక్ తెలిపారు. అవగాహన లేకపోవడంతో సమస్య తీవ్రమయ్యేదాకా ఆసుపత్రికి వెళ్లడంలేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ సమస్య మరింత ముదురుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రోస్టేటైటీస్ సోకడానికి ప్రధాన కారణం మూత్రనాళ ఇన్ఫెక్షన్ అని వైద్యుల పరిశీలనలో తేలిందని డాక్టర్ దీపక్ చెప్పారు. ప్రోస్టేటైటీస్‌ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆయన సూచించారు. చికిత్స ఆలస్యమైతే జీవన నాణ్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. నాలుగైదు వారాల పాటు మందులు వాడితే నయం అవుతుందన్నారు. ప్రోస్టేటైటీస్ తీవ్రమై పుండులా మారితే ఆపరేషన్ చేయాల్సి వస్తుందని చెప్పారు.

ప్రోస్టేటైటీస్ కు కారణాలు ఇవే..
  • మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు
  • అరక్షిత శృంగారం
  • మూత్రమార్గం సంకోచం
  • ప్రోస్టేట్‌ పెరగడం
  • క్షయ వ్యాధి
బాధితులలో కనిపించే లక్షణాలు..
  • తరచూ మూత్ర విసర్జన, ఆ సమయంలో నొప్పి, మంట
  • మూత్రం ఇంకా మిగిలినట్లు అనిపించడం
  • వృషణాల్లో అసౌకర్యం
  • అంగస్తంభనలో సమస్యలు, తర్వాత నొప్పి
  • వీర్యంలో రక్తం పడటం
  • తీవ్రమైన జ్వరం


More Telugu News