లార్డ్స్ లో వాడీవేడిగా టెస్టు మ్యాచ్... ఈ సీన్ చూస్తే చాలు!

  • లార్డ్స్ లో భారత్, ఇంగ్లండ్ మూడో టెస్టు 
  • ఉత్కంఠభరితంగా మ్యాచ్
  • ఓ దశలో మైదానంలో ఉద్రిక్తత
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఇంగ్లాండ్-ఇండియా మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ఐదవ రోజు సంచలన సంఘటన చోటుచేసుకుంది. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ పేసర్ బ్రైడన్ కార్స్‌ల మధ్య ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. 

35వ ఓవర్‌లో జడేజా, కార్స్ బౌలింగ్‌లో షాట్ ఆడి రెండు పరుగుల కోసం పరుగెత్తుతుండగా, ఇద్దరూ మైదానంలో ఢీకొన్నారు. ఈ ఘటనలో కార్స్ జడేజా గొంతును పట్టుకున్నట్లు కనిపించడంతో వాగ్వాదం మొదలైంది. జడేజా తాను బంతిని చూస్తూ పరుగెత్తానని, ఉద్దేశపూర్వకంగా ఢీకొనలేదని సమర్థించుకున్నాడు.ఈ ఘటనతో ఇరువురూ తీవ్రంగా వాదించుకున్నారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెంటనే జోక్యం చేసుకుని ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం చేశాడు. అంపైర్లు కూడా రంగంలోకి దిగి ఇరువురితో మాట్లాడి పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. 

ఈ సంఘటన మ్యాచ్‌లో ఉద్విగ్న వాతావరణాన్ని సృష్టించింది. మాజీ భారత బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్, జడేజా ఈ ఘటనను పరిణతితో నిర్వహించాడని, కార్స్ జడేజా గొంతును పట్టుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. 

ఇక మ్యాచ్ విషయానికొస్తే టీమిండియాకు ఎదురుగాలి వీస్తోంది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ తీవ్ర కష్టాల్లో ఉంది. రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్‌ల వికెట్లను వేగంగా కోల్పోయిన భారత్‌కు జడేజా ఆశాకిరణంలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 9 వికెట్లకు 147 పరుగులు. కాగా, క్రీజులో జడేజా, సిరాజ్ ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 46 పరుగులు కావాలి.


More Telugu News