కార్యాలయంపై దాడి.. కవితపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేసిన తీన్మార్ మల్లన్న

  • నిన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి
  • కవిత అనుచరులు విధ్వంసం సృష్టించారని మండలి చైర్మన్‌కు ఫిర్యాదు
  • తనకు రక్షణ కల్పించాలని చైర్మన్‌ను కోరినట్లు తీన్మార్ మల్లన్న వెల్లడి
నిన్న తనపై హత్యాయత్నం జరిగిందని, ఈ విషయంపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. కవిత అనుచరుల విధ్వంసాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఆదివారం క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి జరిగింది. ఈరోజు మండలి చైర్మన్‌‍ను కలిసిన మల్లన్న దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అనుచరులు క్యూ న్యూస్ కార్యాలయానికి వచ్చి చేసిన విధ్వంసాన్ని చైర్మన్‌కు వివరించానని తెలిపారు. డీజీపీని కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని ఆయన వెల్లడించారు. కార్యాలయంపై దాడి నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలని చైర్మన్‌ను కోరానని తీన్మార్ మల్లన్న తెలిపారు.

కవితపై ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. దాడి ఘటనపై విచారణ జరుపుతామని మండలి చైర్మన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. కవిత బీసీ నినాదం వినిపించడంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. బీసీల కట్టుబాట్లు, పదజాలం ఏమిటో కవితకు తెలియదని వ్యాఖ్యానించారు. బీసీల రాజకీయాన్ని నిలువరించాలనే ఉద్దేశంతోనే ఆమె ఈ నినాదం ఎత్తుకున్నారని ఆరోపించారు.

మరోవైపు, క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి కేసు నేపథ్యంలో పోలీసు శాఖ తీన్మార్ మల్లన్నకు చెందిన ఇద్దరు గన్‌మన్లను సరెండర్ చేసింది. పోలీసు శాఖ ఇద్దరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. తీన్మార్ మల్లన్న చెబితే తాము కాల్పులు జరిపామని పోలీసులు విచారణలో తెలిపారు. అంతకుముందు, తీన్మార్ మల్లన్న ఈ దాడిపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కవితపై కేసు నమోదు చేశారు.


More Telugu News