యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం 20 కి.మీ. నడిచిన 92 ఏళ్ల బామ్మ




తొంభై ఏళ్ల బామ్మ.. నడవడమే కష్టం అలాంటిది ఏకంగా 20 కిలోమీటర్లు నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది. కుక్క కరవడంతో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కోసం ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని నువాపడ జిల్లాకు చెందిన వృద్ధురాలు మంగల్ బారి మోహరాకు 92 ఏళ్లు.. అడుగుతీసి అడుగువేయడమే కష్టంగా మారింది. ఈ క్రమంలో మోహరాను ఇటీవల ఓ కుక్క కరిచింది. దీంతో అందుబాటులో ఉన్న వైద్యుడి వద్ద చికిత్స చేయించుకుంది. ప్రాథమిక చికిత్స చేసిన సదరు వైద్యుడు.. రేబిస్ రాకుండా వ్యాక్సీన్ వేయించుకోవాలని, అ టీకా ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పాడు.

దీంతో వ్యాక్సీన్ కోసం మోహరా తమ గ్రామానికి సమీపంలోని సీనపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు బయలుదేరింది. దాదాపు పది కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న సీనపల్లి వెళ్లేందుకు రవాణా సదుపాయం లేకపోవడంతో చేసేదేంలేక మోహరా కాలినడకనే బయలుదేరింది. ఓవైపు వయోభారం, మరోవైపు కుక్క కరిచిన గాయంతో నడవలేక నడుస్తూ హెల్త్ సెంటర్ ను చేరుకుంది. అక్కడ వ్యాక్సీన్ తీసుకున్నాక తిరిగి నడుచుకుంటూనే గ్రామానికి చేరుకుంది. రాష్ట్రంలో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు సమ్మెకు దిగడంతో రెండు రోజులుగా రవాణా సౌకర్యం నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు.


More Telugu News