ఉత్తర కొరియాలో అంతా కృత్రిమమే.. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ నటించడమే

  • అడుగడుగునా ఆంక్షలతో ఉత్తర కొరియా పర్యటన అంత ఈజీ కాదంటున్న ట్రావెలర్
  • స్కూలు పిల్లల నవ్వులతో సహా అంతా కృత్రిమమే
  • ఎంపిక చేసిన ప్రాంతాల్లో గైడ్ ల పర్యవేక్షణలో సందర్శన
  • చుట్టూ తిప్పి దూరంగా తీసుకెళుతున్నట్లు డ్రైవర్ల నాటకం
ఉత్తర కొరియా.. ప్రపంచంలోని అత్యంత రహస్యమైన దేశం. ఆ దేశంలో ఏంజరుగుతోందనే విషయం బయటి ప్రపంచానికి కొంచెం కూడా తెలియదు. అక్కడి నుంచి అతికష్టమ్మీద తప్పించుకుని పారిపోయి వచ్చిన వారు చెప్పిన వివరాలను బట్టి నార్త్ కొరియాలో జీవనం దుర్లభం. బయటి ప్రపంచంలో తమ దేశంపై నెలకొన్న చెడు అభిప్రాయాన్ని తొలగించడానికి, తమ దేశంలోనూ అంతా బాగుందని చాటిచెప్పడానికి నార్త్ కొరియా సుప్రీంలీడర్ కిమ్ జోంగ్ ఉన్ అప్పుడప్పుడూ పర్యాటకులను ఆహ్వానిస్తుంటారు. అయితే, పర్యాకులను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి, అనేక ఆంక్షల మధ్య దేశంలో తిప్పిచూపిస్తారు. ఇటీవల ఆ దేశంలో పర్యటించే అవకాశం వచ్చిన తమిళ యూట్యూబర్ భువని ధారణ్ ఓ మీడియా సంస్థతో పంచుకున్న విశేషాలు..

మనం ఉత్తర కొరియాగా పిలిచే డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్ కే) లో అడుగుపెట్టీపెట్టగానే అక్కడి ప్రభుత్వం తమ బృందానికి ఇద్దరు గైడ్ లను కేటాయించిందని ధారణ్ చెప్పారు. నాలుగు రోజుల పాటు జరిగిన తమ పర్యటన మొత్తం ఆ ఇద్దరు సూచించిన అడుగుజాడల్లోనే సాగిందన్నారు. ప్రారంభంలోనే గైడ్ లు తమకు పలు సూచనలు చేశారన్నారు. వాటిలో కొన్ని ‘ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకూడదు’ ‘చెడుగా, అసహ్యంగా కనిపించేదాన్ని కానీ, సైనికులను కానీ, కష్టపడి పనిచేస్తున్న వారిని కానీ మీరు రికార్డు చేయకూడదు’ ‘నార్త్ కొరియా అనే పదం ఉపయోగించవద్దు. డీపీఆర్ కే అనాలి’. అదేవిధంగా సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండవని ధారణ్ తెలిపారు. 

స్కూలు సందర్శనలో అంతా కృత్రిమంగా కనిపించిందని ధారణ్ చెప్పారు. తమ బృందంలో వివిధ దేశాలకు చెందిన 18 మంది ఉండగా.. గైడ్ లు తామందరినీ ఒకే క్లాసులోకి తీసుకువెళ్లారని చెప్పారు. తమలాంటి పర్యాటకులతో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలనే విషయంపై ఆ పిల్లలతో బాగా రిహార్సల్ చేయించినట్లు కనిపించిందన్నారు. ఓ పిల్లాడు తనకు ఇంగ్లిష్ తో పాటు రష్యన్ భాష కూడా తెలుసని చెప్పగా.. తాను రష్యాలో మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ధారణ్ చెప్పాడు. అయితే, తాను మాట్లాడిన రష్యన్ భాష అర్థం కాక ఆ బాలుడు తెల్లమొహం వేశాడని వివరించాడు.

బహుశా ఆ బాలుడు సరిగా రిహార్సల్ చేయనట్టుందన్నారు. స్కూలు నుంచి బయటకు వస్తుండగా ప్లేగ్రౌండ్ లో చాలామంది చిన్నారులు ఆడుకుంటూ కనిపించారని, అయితే కాంపౌండ్ దాటుతూ తాను వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఒక్కరు కూడా కనిపించలేదన్నారు. అలాగే, పలు సాంస్కృతిక ప్రదర్శనలలో పిల్లలు అద్భుతంగా చేశారని ధారణ్ వివరించాడు. కానీ ఆ పిల్లల ముఖాల్లో సంతోషం కనిపించలేదని చెప్పుకొచ్చాడు. తమకోసం ఏర్పాటు చేసిన డ్రైవర్ వాహనాన్ని చుట్టూ తిప్పుతూ చాలా దూరం తీసుకెళుతున్నట్లు నాటకమాడారని, నిజానికి తాము ఉన్న చోటుకు చాలా దగ్గర్లోనే తమను తిప్పారని ధారణ్ వివరించాడు.

తాము బసచేసిన హోటల్ లో తమ కోసం ప్రత్యేకంగా విదేశీ వంటకాలు వడ్డించారని ధారణ్ వివరించాడు. అయితే, అవన్నీ చాలా చల్లగా, చాలా సేపటి క్రితం వండినట్లుగా ఉన్నాయని చెప్పాడు. ప్రతి పూటా భోజనం ఇలాగే ఉందన్నాడు. బహుశా వేరేచోట వండించి తెప్పించి ఉంటారని తెలిపాడు. తమతో పాటు ఉన్న గైడ్ లకు, డ్రైవర్లకు వేరుగా స్థానిక వంటకాలు వడ్డించారని వివరించాడు.

ఇక తాము బస చేసిన టౌన్ రాత్రిపూట పూర్తిగా నిశ్శబ్దంగా ఉందన్నారు. ఉదయం పూట కూడా పలువురు నార్త్ కొరియన్లు సంప్రదాయ దుస్తుల్లో సిటీ సందర్శనకు వచ్చిన వారిలా అక్కడక్కడా కుటుంబంతో కలిసి ఫొటోలు దిగుతూ నవ్వుతూ తుళ్లుతూ కనిపించారని ధారణ్ వివరించాడు. అయితే, వారిలో ఒక్కరు కూడా తమతో మాట్లాడలేదని తెలిపాడు. అదంతా నాటకీయంగా, కృత్రిమంగా కనిపించిందని వివరించాడు. ఇక సుప్రీంలీడర్ ను కచ్చితంగా కెప్టెన్ అని కానీ మార్షల్ అని కానీ సంబోధించాలని తమ గైడ్లు ముందే హెచ్చరించారని ధారణ్ చెప్పాడు. పర్యటన ముగిశాక తిరిగి వస్తుండగా అక్కడి భద్రతాధికారులు మాట్లాడుతూ.. తమ వీడియోల్లో కానీ, పోస్టుల్లో కానీ డీపీఆర్ కే (నార్త్ కొరియా) కు వ్యతిరేకంగా ఏదైనా చూపిస్తే తిరిగి తమ దేశంలోకి అనుమతించబోమని చెప్పారన్నాడు.




More Telugu News