Ramachander Rao: రోహిత్ వేముల మరణానికి కారణమైన రామచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎలా ఇస్తారు?: మల్లు భట్టివిక్రమార్క

Ramachander Rao Appointment Questioned by Bhatti Vikramarka
  • రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతోందన్న భట్టి
  • త్వరలోనే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడి
  • రోహిత్ కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని విమర్శ
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుపై డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన రామచందర్ రావును రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. రోహిత్ మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోకుండా... పదవులు ఇస్తున్న బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనపై తమ ప్రభుత్వం విచారణ జరుపుతోందని భట్టివిక్రమార్క తెలిపారు. న్యాయశాఖ దీనిపై పని చేస్తోందని చెప్పారు. త్వరలోనే తెలంగాణలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన బండారు దత్తాత్రేయకు గవర్నర్ పదవి, రామచందర్ రావుకు రాష్ట్ర అధ్యక్ష పదవి, ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ కు ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. 

దేశంలోని దళితులు, ఆదివాసీలకు గౌరవం లేకుండా బీజేపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. దళితులు, ఆదివాసీలకు వ్యతిరేకంగా వ్యవహరించేవారికి బీజేపీ పదవులు ఇస్తుందని దుయ్యబట్టారు. వందల ఏళ్లుగా వెనుకబడిన వర్గాలు అణచివేతకు గురవుతున్నాయని... బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని చెప్పారు. ప్రతి పౌరుడి హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు. 

ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. రోహిత్ వేముల చనిపోతే ఆయన కుటుంబాన్ని కేసీఆర్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు. యూనివర్సిటీల సంక్షేమాన్ని ఏ రోజూ పట్టించుకోలేదని మండిపడ్డారు.
Ramachander Rao
Rohith Vemula
Mallu Bhatti Vikramarka
Telangana BJP
Hyderabad Central University
Dalit
ABVP
Bandaru Dattatreya
Rohith Vemula Act

More Telugu News