మనం హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు రాలేదు: గౌతమ్ గంభీర్

  • ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ముఖ్యమేనన్న గంభీర్
  • కానీ విదేశాలకు దేశం కోసం ఆడటానికి వచ్చామని వ్యాఖ్య
  • మన దృష్టి ఆటపైనే ఉండాలన్న హెడ్ కోచ్
విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎక్కువ సమయాన్ని కుటుంబానికి కాకుండా ఆటకే కేటాయించాలని బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ముఖ్యమేనని... అయితే మనం విదేశాలకు వచ్చిన కారణం వేరని చెప్పారు. మనం హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు రాలేదని... దేశం కోసం ఆడటానికి వచ్చామని అన్నారు. 

ఏదైనా పర్యటనకు వెళ్లినప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో చాలా తక్కువ మందితో ఉండాల్సి ఉంటుందని... వారితో పని చేసి దేశం గర్వపడేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందని గంభీర్ చెప్పారు. కుటుంబానికి సమయం కేటాయించాల్సిందేనని... అయితే, దేశం కోసం ఆడేందుకు వచ్చినప్పుడు మన దృష్టి ఆటపైనే ఉండాలని అన్నారు. తన వరకైతే తనకు ఈ లక్ష్యమే ఎక్కువని చెప్పారు.  

మనకు ప్రతిరోజు పోరాటమేనని... దేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఇది తప్పదని గంభీర్ అన్నారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంటుందని... డ్రెస్సింగ్ రూమ్ కల్చర్ గురించి కూడా మాట్లాడుకోవచ్చని చెప్పారు. మన విజయాలలో కుటుంబాల పాత్ర ఎక్కువగా ఉంటుందని అన్నారు. చటేశ్వర్ పుజారాతో ముఖాముఖిలో గంభీర్ ఈ మేరకు తన అభిప్రాయాలను పంచుకున్నారు. 


More Telugu News