Tej Pratap Yadav: లాలుకు కొడుకు భారీ షాక్.. కొత్త పార్టీ ప్రారంభించనున్న తేజ్ ప్రతాప్ యాదవ్!

Tej Pratap Yadav Hints at Contesting Elections Independently After RJD Fallout
  • మహువాలో కొత్త జెండాతో ర్యాలీ నిర్వహించిన తేజ్ ప్రతాప్
  • వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటన
  • కొడుకును ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరించిన లాలు
బీహార్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సొంత పార్టీ ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్.. తండ్రి లాలు ప్రసాద్ యాదవ్‌కు షాకిచ్చారు. కొత్త పార్టీ బ్యానర్‌పై మహువాలో ర్యాలీ నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు సంకేతాలిచ్చారు. 

పార్టీతో విభేదాల అనంతరం తొలిసారి నిర్వహించిన ఈ ర్యాలీలో తేజ్ ప్రతాప్ మద్దతుదారులు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న జెండాను పట్టుకున్నారు. దానిపై ‘టీమ్ తేజ్ ప్రతాప్’ అని రాసి ఉంది. తన మాజీ నియోజకవర్గమైన మహువాలో రోడ్‌ షోకు నాయకత్వం వహించిన తేజ్ ప్రతాప్ తన సిగ్నేచర్ గ్రీన్ క్యాప్ ధరించారు. అక్కడ మద్దతుదారుల నుంచి ఆయనకు హృదయపూర్వక స్వాగతం లభించింది. 

తాను ఒకరి నియంత్రణ కింద పనిచేయబోనని చెప్పిన తేజ్ ప్రతాప్.. ప్రజల నిర్ణయానికి అనుగుణంగా తన తర్వాతి నిర్ణయం ఉంటుందని చెప్పారు. ప్రజలు ఏది కోరితే అదే చేస్తానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరితే అక్కడి నుంచి పోటీ చేస్తానని వివరించారు.

తేజ్ ప్రతాప్ 2015 అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తాజాగా ఆయనను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆయన తండ్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, అనుష్క యాదవ్ అనే మహిళతో ఉన్న ఫొటోలను షేర్ చేసిన తేజ్ ప్రతాప్ ఆమెతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు తెలిపారు. అయితే, ఆ తర్వాత ఆ ఫొటోలను డిలీట్ చేశారు. తన ఫేస్‌బుక్ హ్యాక్ అయిందని పేర్కొన్నారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనిని తీవ్రంగా పరిగణించిన లాలుప్రసాద్ యాదవ్ తన పెద్ద కొడుకుతో ఉన్న అన్ని సంబంధాలను తెంచుకున్నట్టు ప్రకటించారు.  
Tej Pratap Yadav
Lalu Prasad Yadav
RJD
Bihar Politics
Mahua
Assembly Elections 2024
Team Tej Pratap
Anushka Yadav
Political Party
Bihar

More Telugu News