Priya Nair: హిందుస్థాన్ యూనీలీవర్‌ సీఈవోగా ప్రియా నాయర్.. ఇంతకీ ఎవరీమె?

Priya Nair Becomes First Woman CEO of Hindustan Unilever
  • కంపెనీ 92 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా సీఈవోగా ప్రియ రికార్డ్
  • ఆగస్టు 1న బాధ్యతలు చేపట్టనున్న ప్రియా నాయర్
  • కంపెనీలో మూడు దశాబ్దాలుగా సేవలు
  • పలు లీడర్‌షిప్ రోల్స్‌లో పనిచేసిన అనుభవం
ప్రియా నాయర్.. ఇప్పుడీ పేరు వ్యాపార ప్రపంచంలో మార్మోగుతోంది. హిందూస్థాన్ యూనీలీవర్‌ (హెచ్‌యూఎల్) తదుపరి సీఈవోగా, ఎండీగా ఆమె పేరును ప్రకటించడమే ఇందుకు కారణం. కంపెనీ 92 ఏళ్ల చరిత్రలో ఓ మహిళ సీఈవో కావడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ప్రియా నాయర్ ఎవరన్న ఉత్సుకత మొదలైంది. హెచ్‌యూఎల్‌కు ప్రస్తుతం సీఈవోగా ఉన్న రోహిత్ జావా పదవీకాలం ఈ నెల 31తో ముగుస్తుంది. ఆగస్టు 1న ప్రియా నాయర్ బాధ్యతలు చేపడతారు. 

హెచ్‌యూఎల్‌ను నడిపించనున్న తొలి మహిళగా రికార్డులకెక్కిన ప్రియ సంస్థ బోర్డులోనూ చేరనున్నారు. అలాగే, యూనీలీవర్‌ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (యూఎల్ఈ) సభ్యురాలుగానూ కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె యూనీలీవర్‌లో బ్యూటీ, వెల్‌బీయింగ్ విభాగానికి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. 

మూడు దశాబ్దాలుగా సేవలు
1995లో హెచ్‌యూఎల్‌లో చేరిన ప్రియా నాయర్ హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ వంటి విభాగాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, కన్జుమర్ ఇన్‌సైట్స్ మేనేజర్‌గానూ పనిచేశారు. సంస్థ కీలక ఉత్పత్తులైన డోవ్, రిన్, కంఫర్ట్ వంటి ఉత్పత్తులకు బ్రాండ్ మేనేజర్‌గానూ వ్యవహరించారు. లాండ్రీ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. ఓరల్ కేర్, డియోడరెంట్స్, కస్టమర్ డెవలప్‌మెంట్ విభాగాలను కూడా నిర్వహించారు. 

హార్వర్డ్ నుంచి పట్టా
సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌‌లో ప్రియా నాయర్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో బీకామ్ పూర్తిచేశారు. ఆ తర్వాత పూణెలోని సింబోసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ప్రోగ్రాం ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ పూర్తిచేశారు. 
Priya Nair
Hindustan Unilever
HUL CEO
Rohit Jawa
Unilever Leadership Executive
Beauty and Wellbeing
Home Care
Personal Care
Harvard Business School
Indian Business

More Telugu News