భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కు 'లార్డ్స్'లో అరుదైన గౌరవం

  • లార్డ్స్ మ్యూజియంలో సచిన్ టెండూల్కర్ చిత్రపటం ఆవిష్కరణ
  • ఇది తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్న సచిన్
  • 1983 ప్రపంచకప్‌తోనే లార్డ్స్‌తో తొలి పరిచయమని వెల్లడి
  • కపిల్ ట్రోఫీ అందుకోవడమే తన క్రికెట్ ప్రయాణానికి స్ఫూర్తి
  • ఇదే మైదానంలో టెస్టు మ్యాచ్‌ను గంట మోగించి ప్రారంభించిన మాస్టర్
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. క్రికెట్ మక్కాగా పేరుగాంచిన ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ మ్యూజియంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామంపై సచిన్ స్పందిస్తూ, ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని, చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన లార్డ్స్ మైదానంతో తనకున్న అనుబంధాన్ని, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "1983లో కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడే నాకు లార్డ్స్‌తో తొలి పరిచయం ఏర్పడింది. బాల్కనీలో కపిల్ ట్రోఫీని అందుకోవడం చూశాను. ఆ క్షణమే నా క్రికెట్ ప్రయాణానికి నాంది పలికింది" అని సచిన్ ఉద్వేగంగా చెప్పారు. తనను క్రికెటర్‌గా తీర్చిదిద్దిన స్ఫూర్తిదాయక ఘట్టం జరిగిన చోటే తన చిత్రపటానికి స్థానం దక్కడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఇటీవల భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌ను సైతం సచిన్ లార్డ్స్ మైదానంలో సంప్రదాయ గంటను మోగించి ప్రారంభించిన విషయం తెలిసిందే. క్రీడాకారుడిగా ఎన్నో రికార్డులు నెలకొల్పిన సచిన్‌కు, ఇప్పుడు లార్డ్స్ మ్యూజియంలో చిత్రపటం రూపంలో శాశ్వత స్థానం లభించడం ఆయన కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా నిలిచింది.

ఇవాళ భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ లో మూడో టెస్టును సచిన్ గంట మోగించి లాంఛనంగా ప్రారంభించారు. 


More Telugu News