Donald Trump: ట్రంప్‌ను టార్గెట్ చేస్తాం.. ఫ్లోరిడాలోనూ వదలం: ఇరాన్ తీవ్ర హెచ్చరిక

Donald Trump Targeted in Florida Iran Threat
  • ట్రంప్‌కు ఇరాన్ నుంచి హత్యాయత్నం బెదిరింపులు
  • ఫ్లోరిడాలో సన్‌బాత్ చేస్తుండగా డ్రోన్‌తో దాడి చేస్తామని హెచ్చరిక
  • ఇరాన్ సుప్రీంలీడర్ సలహాదారు జావద్ లారిజాని వ్యాఖ్యలు
  • సులేమానీ హత్యకు ప్రతీకారంగానే ఈ వ్యాఖ్యలు
  • ట్రంప్‌పై బౌంటీ కోసం 27 మిలియన్ డాలర్ల నిధుల సేకరణ
  • బెదిరింపులను తీవ్రంగానే పరిగణిస్తున్నట్టు ట్రంప్ వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు ఎదురయ్యాయి. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో సన్‌బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్‌తో దాడి చేసి లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించడం కలకలం రేపుతోంది. ఇటీవల ఇరాన్ అణుకేంద్రాలపై అమెరికా దాడులు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇరాన్ సుప్రీంలీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సలహాదారు జావద్ లారిజాని స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ట్రంప్‌నకు ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్ కూడా ఇక ఏమాత్రం సురక్షితం కాదు. ఆయన సన్‌బాత్ చేస్తుండగా డ్రోన్‌తో లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా సులభమైన పని" అని ఆయన హెచ్చరించారు. 2020లో ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సులేమానీ హత్య వెనుక ట్రంప్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగానే ఈ హెచ్చరికలు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు, ‘బ్లడ్ పాక్ట్’ అనే ఓ ప్లాట్‌ఫామ్ ట్రంప్‌పై బౌంటీ ప్రకటించి నిధులు సేకరించడం గమనార్హం. ఈ నెల 8 నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌లో సుమారు 27 మిలియన్ డాలర్లు పోగయ్యాయి. ఇరాన్ శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుంది.

ఈ హత్యాయత్నం బెదిరింపులపై ట్రంప్ స్పందించారు. ఇరాన్ అధికారి వ్యాఖ్యలను ముప్పుగా భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా "అవును, నేను ఈ వ్యాఖ్యలను ముప్పుగానే భావిస్తున్నా. అది నిజమో కాదో తెలియదు, కానీ కావచ్చు" అని బదులిచ్చారు. చివరిసారిగా ఎప్పుడు సన్‌బాత్‌కు వెళ్లారని అడగ్గా, నవ్వుతూ తన ఏడేళ్ల వయసులో అని, ఆ తర్వాత తనకు అంతగా ఇష్టం ఉండదని సమాధానమిచ్చారు. ప్రస్తుతం టెహ్రాన్‌ చర్చలకు రావాలని అమెరికా పిలుపునిస్తుండగా, ఈ బెదిరింపుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Donald Trump
Iran
Florida
Qassem Soleimani
Mar-a-Lago
drone attack
US Iran tensions
Javad Larijani
Aytollah Ali Khamenei
Blood Pact

More Telugu News