Sanjay Gaikwad: ఎమ్మెల్యే దాడి ఎఫెక్ట్: క్యాంటీన్ లైసెన్స్ రద్దు.. రంగంలోకి అధికారులు

Sanjay Gaikwad Canteen License Cancelled After MLA Attack
  • ముంబై క్యాంటీన్‌లో నాసిరకం భోజనం
  • క్యాంటీన్ సిబ్బందిపై శివసేన ఎమ్మెల్యే దాడి
  • రంగంలోకి దిగిన ఆహార భద్రతా అధికారులు, క్యాంటీన్‌లో తనిఖీలు
  • నిబంధనల ఉల్లంఘన.. అజంతా క్యాటరర్స్ లైసెన్స్ సస్పెన్షన్
హాస్టల్ క్యాంటీన్‌లో నాసిరకం భోజనం అందించారంటూ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ సిబ్బందిపై చేయి చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన మరుసటి రోజే, మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులు రంగంలోకి దిగి, ఆ క్యాంటీన్ లైసెన్సును సస్పెండ్ చేశారు.

ఎఫ్‌డీఏ అధికారులు నిన్న క్యాంటీన్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. వంటగది, ఆహార నిల్వ ప్రాంతాలను పరిశీలించి, ఆహార భద్రతా ప్రమాణాల చట్టాన్ని ఉల్లంఘించినట్టు గుర్తించారు. మొత్తం 16 ఆహార నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబొరేటరీకి పంపారు. నివేదికలు 14 రోజుల్లో వస్తాయని తెలిపారు. తనిఖీల అనంతరం, క్యాంటీన్‌ను నిర్వహిస్తున్న అజంతా క్యాటరర్స్ లైసెన్సును తక్షణమే సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

అసలేం జరిగింది?
క్యాంటీన్ సిబ్బందిపై మంగళవారం రాత్రి దాడి జరగ్గా, దానికి సంబంధించిన వీడియో నిన్న బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే గైక్వాడ్ క్యాంటీన్ నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగడం కనిపించింది. పాడైపోయిందంటూ చెబుతున్న పప్పు ప్యాకెట్‌ను వాసన చూడమని చెప్పి, ఉన్నట్టుండి సిబ్బందిపై పిడిగుద్దులు కురిపించారు. ఈ దాడిలో సిబ్బంది కిందపడిపోగా, లేవబోతున్న అతడిని మరోసారి చెంపపై కొట్టారు. 'నా స్టైల్‌లో బుద్ధి చెప్పాను' అని గైక్వాడ్ వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది.

ఈ ఘటనపై గైక్వాడ్ స్పందిస్తూ తన చర్యను సమర్థించుకున్నారు. "క్యాంటీన్‌లో ఆర్డర్ చేసిన పప్పు, అన్నం తిన్న వెంటనే వాంతి అయింది. ఆహారం పూర్తిగా పాడైపోయింది," అని ఆయన ఆరోపించారు. గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినా నాణ్యత మార్చలేదని, ఆహారంలో బల్లులు, ఎలుకలు కూడా వచ్చాయని ఆరోపించారు. "ప్రజాస్వామ్య పద్ధతిలో చెబితే వినని వారికి శివసేన స్టైల్‌లో ఇలాగే బుద్ధి చెప్పాల్సి వస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ, ఎమ్మెల్యే ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని, ఫిర్యాదులుంటే పద్ధతి ప్రకారం వెళ్లాలి కానీ, సిబ్బందిపై దాడి చేయడం సరికాదని హితవు పలికారు.
Sanjay Gaikwad
Shiv Sena
MLA
Maharashtra FDA
canteen food
food quality
Ajanta Caterers
food license suspended
poor food quality
hostel canteen

More Telugu News