ఆమె నా ఐఫోన్, లాప్‌టాప్ దొంగిలించింది.. ఎదురు కేసు పెట్టిన ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాల్‌

  • ఆర్‌సీబీ క్రికెటర్ యశ్ దయాల్‌పై లైంగిక ఆరోపణలు
  • పెళ్లి పేరుతో వాడుకున్నాడని ఘజియాబాద్‌లో యువతి ఎఫ్ఐఆర్
  • ఆరోపణలను ఖండించిన యశ్.. ప్రయాగ్‌రాజ్‌లో ఎదురు ఫిర్యాదు
  • వైద్యం పేరుతో లక్షల రూపాయలు తీసుకుందని వెల్లడి
  • ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై మోసం చేసిందన్న క్రికెటర్
ఐపీఎల్ 2025 విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పేసర్ యశ్ దయాల్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఓ యువతి ఆరోపణలు చేయగా, అసలు ఆమె ఒక దొంగ అని, తన డబ్బు, వస్తువులు కాజేసిందని యశ్ దయాల్ ఎదురు ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ వివాదం కొత్త మలుపు తీసుకుంది.

ఘజియాబాద్‌కు చెందిన ఓ యువ‌తి ఫిర్యాదు మేర‌కు యశ్ దయాల్‌పై ఆదివారం ఇందిరాపురం పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 69 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి పేరుతో నమ్మించి లైంగికంగా వాడుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఐదేళ్లుగా తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఈ విషయంపై జూన్ 21న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కూడా ఐజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.

ఈ ఆరోపణలపై యశ్ దయాల్ తీవ్రంగా స్పందించాడు. ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆయన సదరు మహిళపై ఎదురు ఫిర్యాదు చేశాడు. 2021లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఆమె పరిచయమైందని, అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నామని తెలిపాడు. తన ఐఫోన్, లాప్‌టాప్ దొంగిలించిందని ఆయన ఆరోపించాడు. అంతేకాకుండా తన కుటుంబానికి, తనకు వైద్య చికిత్సల పేరుతో లక్షలాది రూపాయలు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించలేదని పేర్కొన్నాడు. షాపింగ్ కోసం కూడా పలుమార్లు డబ్బు తీసుకుందని, వీటన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని యశ్ దయాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఘజియాబాద్ పోలీసులు తనపై కేసు నమోదు చేశారని తెలిసిన తర్వాతే తాను న్యాయపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు యశ్ దయాల్ తెలిపాడు. సదరు మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరిపై, మరికొందరిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తన మూడు పేజీల ఫిర్యాదులో కోరాడు.


More Telugu News