ఏళ్లుగా టెక్స్టింగ్.. కోహ్లీతో నాకు పరిచయం ఉంది: నోవాక్ జొకోవిచ్

  • వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన జొకోవిచ్
  • జొకోవిచ్ మ్యాచ్ చూసేందుకు హాజరైన విరాట్ కోహ్లీ
  • కొన్నేళ్లుగా కోహ్లీతో టచ్‌లో ఉన్నానన్న సెర్బియా స్టార్
  • ఇప్పటివరకు వ్యక్తిగతంగా కలుసుకోలేదని వెల్లడి
  • కోహ్లీ కెరీర్‌ను ఆరాధిస్తానంటూ జొకోవిచ్ ప్రశంసలు
టెన్నిస్ దిగ్గజం నోవాక్ జొకోవిచ్, భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న స్నేహబంధం తాజాగా వెలుగులోకి వచ్చింది. వింబుల్డన్ టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ విజయాన్ని కోహ్లీ ప్రత్యక్షంగా వీక్షించాడు. అనంతరం జొకోవిచ్, కోహ్లీతో తనకున్న పరిచయం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

"విరాట్ కోహ్లీ, నేను కొన్నేళ్లుగా టెక్స్టింగ్ ద్వారా టచ్‌లో ఉన్నాం. కానీ ఇప్పటివరకు మేమిద్దరం వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం రాలేదు" అని జొకోవిచ్ ఒక క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ తెలిపాడు. "నా గురించి కోహ్లీ గొప్పగా మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. ఆయన కెరీర్‌ను, సాధించిన విజయాలను నేను ఎంతగానో ఆరాధిస్తాను" అని జొకోవిచ్ పేర్కొన్నాడు. అంతకుముందు జొకోవిచ్‌ను ఉద్దేశిస్తూ "గ్లాడియేటర్ నుంచి ఇది మామూలే" అంటూ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

ఈ సందర్భంగా జొకోవిచ్ క్రికెట్‌పై కూడా సరదాగా స్పందించాడు. "నేను క్రికెట్ ఆడటం ప్రారంభించాను. కానీ, అందులో అంత నైపుణ్యం లేదు. భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి నాకు తెలుసు. అందుకే, భారత్‌కు వెళ్లేలోపు నా క్రికెట్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. లేకపోతే అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది" అని స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు.

వింబుల్డన్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్ డి మినార్‌తో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ అద్భుత విజయం సాధించాడు. తొలి సెట్‌ను 1-6 తేడాతో కోల్పోయినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని 1-6, 6-4, 6-4, 6-4 స్కోరుతో గెలుపొందాడు. ఈ విజయంతో జొకోవిచ్ 16వ సారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈసారి వింబుల్డన్ టైటిల్ గెలిస్తే, రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న 8 టైటిళ్ల రికార్డును జొకోవిచ్ సమం చేస్తాడు.


More Telugu News