AM Ratnam: 'హరిహర వీరమల్లు'పై ఆ వార్తలు చూసి బాధ, కోపం వచ్చాయి: ఏఎం రత్నం

AM Ratnam Reacts to Hari Hara Veera Mallu Postponement Rumors
  • సినిమా 14 సార్లు కాదు, కేవలం 3 సార్లే వాయిదా పడిందన్న ఏఎం ర‌త్నం
  • వీఎఫ్‌ఎక్స్ పనులు, క‌రోనా, ఎన్నికల వల్లే ఆలస్యమైందని వెల్లడి
  • బిజినెస్ కాలేదన్న ప్రచారంలో నిజం లేదన్న నిర్మాత
  • ఈ చిత్రం పవన్ కల్యాణ్ స్థాయిని కచ్చితంగా పెంచుతుందని ధీమా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా విడుదలపై వస్తున్న వదంతులపై నిర్మాత ఏఎం రత్నం తాజాగా స్పందించారు. సినిమా పదేపదే వాయిదా పడుతోందంటూ మీడియాలో వచ్చిన కథనాలు తనను ఎంతగానో బాధించాయని, వాటిని చూసి కోపం కూడా వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జులై 24న సినిమా విడుదల కానున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.

‘‘మా సినిమా దాదాపు 14 సార్లు వాయిదా పడినట్లు ప్రచారం చేశారు. కానీ నిజానికి కేవలం మూడుసార్లు మాత్రమే పోస్ట్‌పోన్‌ చేశాం. మార్చి 28, మే 9, జూన్‌ 12 తేదీలకు వాయిదా వేశాం. జూన్‌ 12న విడుదల చేయలేకపోయినప్పుడు నేను కూడా చాలా బాధపడ్డాను. నా కెరీర్‌లో ఏ సినిమా ఒక్కసారి కూడా వాయిదా పడలేదు’’ అని ఏఎం రత్నం చెప్పారు.

సినిమా ఆలస్యం కావడానికి గల కారణాలను కూడా ఆయన స్పష్టంగా తెలియ‌జేశారు. ‘‘హరిహర వీరమల్లు చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్ చాలా ఎక్కువ. గతంలో ‘బాహుబలి’ వంటి భారీ చిత్రాలు కూడా వీఎఫ్‌ఎక్స్ పనుల కారణంగానే అనుకున్న సమయానికి రాలేకపోయాయి. ఈ సినిమా ఆలస్యానికి కూడా అదే ప్రధాన కారణం. దీనికి తోడు క‌రోనా మహమ్మారి, ఆ తర్వాత ఎన్నికలు రావడంతో షూటింగ్ కొంతకాలం ఆపాల్సి వచ్చింది. బిజినెస్ కాకపోవడం వల్లే వాయిదా వేశారన్న వార్తల్లోనూ నిజం లేదు’’ అని ఆయన అన్నారు. 

ఎన్నో కష్టాలు దాటుకుని సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దామని, ట్రైలర్ చూశాక అందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ స్థాయిని మరింత పెంచుతుందని ఏఎం ర‌త్నం ధీమా వ్యక్తం చేశారు.
AM Ratnam
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Telugu movie
movie release date
AM Ratnam interview
movie postponement
VFX work
Telugu cinema
film industry

More Telugu News