RCB: ఐపీఎల్‌లో ఆర్సీబీ సరికొత్త చరిత్ర.. కప్పు గెలవడమే కాదు, బ్రాండ్ విలువలోనూ టాప్!

Royal Challengers Bangalore Tops IPL Brand Value Charts
  • ఐపీఎల్ బ్రాండ్ విలువలో ఆర్సీబీకి అగ్రస్థానం
  • రెండో స్థానంలో ముంబై, మూడో స్థానానికి పడిపోయిన చెన్నై
  • 18.5 బిలియన్ డాలర్లకు చేరిన ఐపీఎల్ మొత్తం బ్రాండ్ వాల్యూ
  • స్పాన్సర్‌షిప్ ఒప్పందాల ద్వారా బీసీసీఐకి భారీగా పెరిగిన ఆదాయం
  • బ్రాండ్ విలువలో అత్యధిక వృద్ధి నమోదు చేసిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 సీజన్ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా, అత్యంత విలువైన ఫ్రాంచైజీగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఏళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ (ఎంఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వంటి జట్లను వెనక్కి నెట్టి ఆర్సీబీ ఈ ఘనత సాధించడం విశేషం.

ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ హౌలిహాన్ లోకీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, ఆర్సీబీ బ్రాండ్ విలువ గత ఏడాదితో పోలిస్తే 227 మిలియన్ డాలర్ల నుంచి 269 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ 242 మిలియన్ డాలర్ల విలువతో రెండో స్థానంలో ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ 235 మిలియన్ డాలర్ల విలువతో మూడో స్థానానికి పరిమితమైంది. అయితే, బ్రాండ్ విలువలో వార్షికంగా అత్యధిక వృద్ధిని పంజాబ్ కింగ్స్ (39.6%) నమోదు చేసింది.

లీగ్ పరంగా చూస్తే, ఐపీఎల్ వ్యాపార విలువ గత ఏడాదితో పోలిస్తే 12.9 శాతం వృద్ధితో 18.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.54 లక్షల కోట్లు) చేరింది. అలాగే, ఐపీఎల్ బ్రాండ్ విలువ కూడా 13.8 శాతం పెరిగి 3.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఆదాయం విషయంలోనూ ఐపీఎల్ దూసుకుపోతోంది. టాటా గ్రూప్‌తో టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను 2028 వరకు పొడిగించడం ద్వారా బీసీసీఐకి సుమారు రూ. 2,500 కోట్లు అందనుంది. మై11సర్కిల్, ఏంజెల్ వన్ వంటి నాలుగు అసోసియేట్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా మరో రూ. 1,485 కోట్లు సమకూరాయి. ఇది గత సైకిల్ కంటే 25 శాతం అధికం. వీక్షణలోనూ ఐపీఎల్ కొత్త రికార్డులు సృష్టించింది. 2025 ఫైనల్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో 67.8 కోట్ల మందికి పైగా వీక్షించారు.

"ఐపీఎల్ క్రీడా వ్యాపారంలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోంది. ఫ్రాంచైజీల విలువలు, మీడియా హక్కులు, బ్రాండ్ భాగస్వామ్యాలు రికార్డు స్థాయికి చేరాయి" అని హౌలిహాన్ లోకీ డైరెక్టర్ హర్ష్ తాలికోటి తెలిపారు.
RCB
Royal Challengers Bangalore
IPL 2025
Indian Premier League
Mumbai Indians
Chennai Super Kings
Brand Value
Franchise Value
Cricket
BCCI

More Telugu News