ఆధార్ కేంద్రం అడ్రస్ చెప్పే ‘భువన్ ఆధార్’ పోర్టల్

  • సమీపంలోని కేంద్రాలను సులభంగా గుర్తించే సౌకర్యం
  • యూఐడీఏఐ, ఇస్రో సంయుక్త భాగస్వామ్యం
  • కేంద్రానికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ సదుపాయం
  • అవసరమైన సేవలను ఫిల్టర్ చేసుకునే వీలు
ఆధార్ కార్డులో వివరాలు మార్చుకోవాలన్నా, కొత్తగా నమోదు చేసుకోవాలన్నా సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లడం తప్పనిసరి. అయితే నగరాల్లో ఈ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కాస్త ఇబ్బందికరమే. ఈ సమస్యకు పరిష్కారంగా భారత విశిష్ట ప్రాధికార సంస్థ, ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో కలిసి 'భువన్‌ ఆధార్' అనే ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ పోర్టల్ ద్వారా ఆధార్ కార్డుదారులు తమకు దగ్గరలో ఉన్న కేంద్రాలను అత్యంత సులభంగా గుర్తించవచ్చు. కేంద్రం చిరునామాతో పాటూ అక్కడికి చేరుకోవడానికి అవసరమైన రూట్ మ్యాప్‌ను కూడా ఈ పోర్టల్ అందిస్తుంది. వినియోగదారుల సౌకర్యార్థం ఇందులో నాలుగు రకాల సెర్చ్ ఆప్షన్లు ఉన్నాయి. 'సెంటర్స్‌ నియర్‌బై' ఆప్షన్‌తో సమీప కేంద్రాలను, 'సెర్చ్ బై పిన్‌కోడ్' ద్వారా నిర్దిష్ట ప్రాంతంలోని కేంద్రాలను తెలుసుకోవచ్చు.

అంతేకాకుండా, రాష్ట్రం, జిల్లా, మండలం వంటి వివరాలను ఎంచుకుని కూడా కేంద్రాల జాబితాను పొందవచ్చు. వినియోగదారులు తాము పొందాలనుకుంటున్న సేవలు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయో లేదో కూడా ముందుగానే ఫిల్టర్ చేసి చూసుకునే సౌకర్యం కల్పించారు. దీనివల్ల ప్రజల సమయం ఆదా అవ్వడంతో పాటు, ఆధార్ సంబంధిత సేవలు మరింత వేగంగా, సౌకర్యవంతంగా పొందేందుకు వీలు కలుగుతుంది.


More Telugu News