కీరవాణి తండ్రి శివశక్తి దత్తా కన్నుమూత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం

  • ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట విషాదం
  • ఆయన తండ్రి, రచయిత శివశక్తి దత్తా (92) కన్నుమూత
  • సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపిన పవన్ కల్యాణ్
  • కీరవాణి, ఆయన సోదరులకు పవన్ ప్రగాఢ సానుభూతి
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి, ప్రముఖ రచయిత, చిత్రకారుడు శివశక్తి దత్తా (92) కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. శివశక్తి దత్తా మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

మణికొండలోని తన నివాసంలో శివశక్తి దత్తా తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయనకు సినీ పరిశ్రమతో మంచి అనుబంధం ఉంది. ఆయన మరణంతో కీరవాణి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు వారికి సంతాపం తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తన సంతాప సందేశాన్ని పంచుకున్నారు. "ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగంతో బాధపడుతున్న కీరవాణికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని పవన్ పేర్కొన్నారు.


More Telugu News