భారీ ఓటమి ఎఫెక్ట్.. భారత్‌ను దెబ్బకొట్టేందుకు ఇంగ్లండ్ మాస్టర్ ప్లాన్

  • ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారీ ఓటమి తర్వాత ఇంగ్లండ్ కీలక నిర్ణయం
  • లార్డ్స్‌లో జరగబోయే మూడో టెస్టుకు పేస్ పిచ్ కావాలని అభ్యర్థన
  • గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగి వస్తున్న ఫాస్ట్ బౌలర్ ఆర్చర్
  • పేసర్ గస్ అట్కిన్సన్ కూడా మూడో టెస్టుకు ఎంపికయ్యే అవకాశం
ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియా చేతిలో ఎదురైన 336 పరుగుల భారీ ఓటమి ఇంగ్లండ్ జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. ఈ పరాభవం నుంచి తేరుకున్న ఇంగ్లీష్ జట్టు.. సిరీస్‌లో పైచేయి సాధించేందుకు పక్కా వ్యూహంతో సిద్ధమవుతోంది. జులై 10న లార్డ్స్‌లో ప్రారంభం కానున్న మూడో టెస్టు కోసం పేస్‌, బౌన్స్‌కు అనుకూలించే పిచ్‌ను సిద్ధం చేయాలని ప్రత్యేకంగా అభ్యర్థించింది. తమ ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్‌ల పునరాగమనంతో భారత్‌ను కట్టడి చేయాలని చూస్తోంది.

ఎడ్జ్‌బాస్టన్‌లోని ఫ్లాట్ పిచ్‌పై భారత బౌలర్లు మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించి ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. దీంతో ఇప్పుడు తమ బలాన్ని నమ్ముకోవాలని ఇంగ్లండ్ నిర్ణయించుకుంది. పిచ్‌లో మరింత వేగం, బౌన్స్‌ ఉండేలా చూడాలని ఎంసీసీ హెడ్ గ్రౌండ్స్‌మన్‌ను కోరినట్లు ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ తెలిపారు. "పిచ్‌లో జీవం ఉంటే మ్యాచ్ మరింత రసవత్తరంగా ఉంటుంది. ఇది కచ్చితంగా ఒక బ్లాక్‌బస్టర్ మ్యాచ్ అవుతుంది" అని ఆయన తెలిపాడు.

సుదీర్ఘకాలంగా మోచేతి, వెన్నునొప్పి గాయాలతో టెస్ట్ క్రికెట్‌కు దూరమైన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. 2021 ఫిబ్రవరి తర్వాత ఆర్చర్ ఆడబోయే తొలి టెస్టు ఇదే కావడం విశేషం. "జోఫ్రా ఆర్చర్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. మూడో టెస్టు సెలక్షన్‌కు అతను అందుబాటులో ఉంటాడు. అతని పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అని మెకల్లమ్ చెప్పాడు. 

మరోవైపు గాయం నుంచి కోలుకున్న పేసర్ గస్ అట్కిన్సన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్న సిరీస్‌లో ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లు లార్డ్స్‌లో హోరాహోరీగా తలపడనున్నాయి.


More Telugu News