హఫీజ్ వంటి ఉగ్రవాదులను భారత్ కు అప్పగించేందుకు సిద్ధమన్న బిలావల్... మండిపడ్డ హఫీజ్ సయీద్ కుమారుడు

  • బాధ్యతారహితమైన ప్రతిపాదన అన్న హఫీజ్ కుమారుడు తల్హా
  • భారత నేతలనే అప్పగించాలని తల్హా డిమాండ్
  • బిలావల్ ప్రకటన పాకిస్థాన్‌కు అవమానకరమని వ్యాఖ్య
పాకిస్థాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర దుమారం రేపాయి. భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అప్పగించేందుకు సిద్ధమంటూ ఆయన చేసిన ప్రతిపాదనపై లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిలావల్ వ్యాఖ్యలను బాధ్యతారహితమైనవిగా అభివర్ణించిన తల్హా, పాకిస్థానీయులను కాకుండా భారత నాయకులనే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల ఖతార్‌కు చెందిన అల్ జజీరా వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో విశ్వాసం పెంచే చర్యల్లో భాగంగా హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ వంటి ఉగ్రవాదులను అప్పగించేందుకు పాకిస్థాన్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇందుకు భారత్ కూడా సహకరించేందుకు సుముఖత చూపాలని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఆదివారం ఓ వీడియో విడుదల చేసిన తల్హా సయీద్ తీవ్రంగా స్పందించారు. "శత్రుదేశమైన భారత్‌కు మా నాన్నను అప్పగించాలని బిలావల్ సూచించడం పాకిస్థాన్‌కు అంతర్జాతీయంగా అవమానం కలిగించింది. దీన్ని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తాం" అని హెచ్చరించారు. భుట్టో కుటుంబం ఎప్పుడూ పాశ్చాత్య దేశాలు, భారత్‌ వాదనకే మద్దతు ఇస్తుందని ఆయన ఆరోపించారు.

ఈ వివాదంపై లష్కరే తోయిబా రాజకీయ విభాగమైన 'పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్' కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది భారతేనని ఆరోపించింది. కాగా, అమెరికా ట్రెజరీ విభాగం హఫీజ్ సయీద్‌తో పాటు ఆయన కుమారుడు తల్హాను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. 


More Telugu News