హైదరాబాద్ లో ఏపీ టెక్కీ ఆత్మహత్య... కారణం ఇదే!

  • ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పవన్
  • ఎల్లారెడ్డిగూడ బాయ్స్ హాస్టల్ లో ఘటన 
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
లోన్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌ల కారణంగా మరో యువకుడు బలయ్యాడు. ఈ మధ్య కాలంలో చాలా మంది యువకులు లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకుని బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారు. ఆ అప్పులు తీర్చలేక మానసిక వేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా మామదూరు గ్రామానికి చెందిన వీర్లపల్లి పవన్ (24) హైదరాబాద్‌లోని ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ ఎల్లారెడ్డిగూడలోని ఒక బాయ్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. నిన్న పవన్ బాత్రూమ్‌కు వెళ్ళిన తర్వాత ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో రూమ్‌లో ఉన్న అతని స్నేహితులు హాస్టల్ సిబ్బందికి తెలియజేశారు.

హాస్టల్ సిబ్బంది బాత్రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా, ఎగ్జాస్ట్ ఫ్యాన్ కొక్కానికి టవల్‌తో ఉరి వేసుకుని కనిపించాడు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

పోలీసులు అతని సెల్ ఫోన్‌ను పరిశీలించగా, బెట్టింగ్ యాప్‌లు, లోన్ యాప్‌ల మెసేజ్‌లు ఉన్నట్లు గుర్తించారు. అతను చేసిన అప్పులను ఇటీవలే తండ్రి చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతను ఆ యాప్‌ల నిర్వాహకుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News