అప్పుడు హేళన.. ఇప్పుడు ప్రశంసలు.. గుకేశ్ దెబ్బకు దిగొచ్చిన కార్ల్‌సన్!

  • గ్రాండ్ చెస్ టోర్నీలో కార్ల్‌సన్‌పై గుకేశ్ అద్భుత విజయం
  • టోర్నీకి ముందు గుకేశ్‌ను బలహీన ఆటగాడిగా పేర్కొన్న కార్ల్‌సన్
  • ఓటమి తర్వాత గుకేశ్ ఆటను ప్రశంసలతో ముంచెత్తిన ప్రపంచ నం.01
  • గుకేశ్ చేతిలో గట్టి శిక్ష పడిందంటూ కార్ల్‌సన్ వ్యాఖ్య
  • విజయం క్రెడిట్ మొత్తం గుకేశ్‌దేనని హుందాగా అంగీకారం
తాను బలహీనమైన ఆటగాడిగా అభివర్ణించిన భారత చెస్ సంచలనం దొమ్మరాజు గుకేశ్ చేతిలోనే ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్ కార్ల్‌సన్‌కు పరాభవం ఎదురైంది. క్రొయేషియా వేదికగా జరుగుతున్న గ్రాండ్ చెస్ టోర్నమెంట్ ర్యాపిడ్ విభాగంలో గుకేశ్ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. ఈ ఓటమి అనంతరం కార్ల్‌సన్ స్పందిస్తూ, 18 ఏళ్ల గుకేశ్ చేతిలో తనకు గట్టి శిక్ష పడిందని అంగీకరించడం విశేషం.

ఈ మ్యాచ్ గురించి కార్ల్‌సన్ మాట్లాడుతూ.. "ఈ టోర్నీలో నేను చాలా చెత్తగా ఆడాను. ఇప్పుడు గుకేశ్ చేతిలో గట్టి దెబ్బ తగిలింది. మొదట నేను మంచి స్థితిలోనే ఉన్నా అనుకున్నాను. కానీ గుకేశ్ తన అవకాశాలను తానే సృష్టించుకున్నాడు. నాకు సమయం తక్కువగా ఉండటంతో ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. అతను చాలా మంచి ఎత్తులు వేశాడు. నాకు ఒకటి రెండు అవకాశాలు వచ్చినా నిలబెట్టుకోలేకపోయాను" అని వివరించాడు.

టోర్నమెంట్ ప్రారంభానికి ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గుకేశ్ ఆటతీరును తక్కువగా అంచనా వేస్తూ కార్ల్‌సన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, ఇప్పుడు అదే గుకేశ్‌పై ప్రశంసలు కురిపిస్తూ, "ఈ విజయం క్రెడిట్ మొత్తం గుకేశ్‌దే. అతను చాలా అద్భుతంగా ఆడాడు" అని తన ఓటమిని హుందాగా అంగీకరించాడు. 


More Telugu News