పెళ్లయిన కొన్ని రోజులకే సాకర్ స్టార్ దుర్మరణం

  • కారు ప్రమాదంలో లివర్‌పూల్ స్టార్ డియోగో జోటా దుర్మరణం
  • జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ సిల్వా కూడా మృతి
  • స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో ఘోర దుర్ఘటన
  • పది రోజుల క్రితమే తన ప్రేయసి రూట్ కార్డోసోతో వివాహం
  • ప్రమాదానికి కొన్ని గంటల ముందే పెళ్లి వీడియో పోస్ట్ చేసిన జోటా
  • క్రీడాలోకంలో తీవ్ర దిగ్భ్రాంతి
క్రీడా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ.. ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ లివర్‌పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా (28) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. 10 రోజుల క్రితమే ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న జోటా, స్పెయిన్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ప్రమాదంలో జోటా సోదరుడు కూడా మృతి చెందాడు.

స్పెయిన్‌లోని జమోరా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జోటాతో పాటు అతడి సోదరుడు ఆండ్రీ సిల్వా (26) కూడా అక్కడికక్కడే మృతిచెందాడు.

జూన్ 22న తన ప్రేయసి రూట్ కార్డోసోను జోటా వివాహం చేసుకున్నాడు. వారికి పెళ్లికి ముందే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరగడానికి కేవలం కొన్ని గంటల ముందే, "ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం" అనే క్యాప్షన్‌తో తన పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ పోస్ట్ చూసిన అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

పోర్చుగల్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించిన జోటా, 2020 సెప్టెంబర్‌లో లివర్‌పూల్ క్లబ్‌లో చేరాడు. గత మే నెలలోనే లివర్‌పూల్ జట్టుతో కలిసి ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. జోటా అకాల మరణంపై క్రీడాలోకం సంతాపం వ్యక్తం చేస్తోంది. అతడి స్వదేశం పోర్చుగల్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 


More Telugu News