ట్యూషన్‌కు వెళ్లమనడమే పాపమైంది.. భవనం పైనుంచి దూకి బాలుడి ఆత్మహత్య!

  • ముంబైలో తీవ్ర విషాదం.. తల్లి మందలించడంతో విద్యార్థి బలవన్మరణం
  • ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి చేయడమే కారణంగా వెల్లడి
  • కండివాలి ప్రాంతంలోని భవనంపై నుంచి దూకిన బాలుడు
  • రక్తపు మడుగులో కొడుకును చూసి కుప్పకూలిన తల్లి
ట్యూషన్‌కు వెళ్లి బాగా చదువుకొమ్మని తల్లి మందలించడంతో ముంబైలో ఓ పద్నాలుగేళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముంబైలోని కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పంత్ ఆర్తి మక్వానా (14) అనే బాలుడిని అతని తల్లి నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో ట్యూషన్‌కు వెళ్లమని చెప్పింది.  అయితే, ట్యూషన్‌కు వెళ్లేందుకు పంత్ ఇష్టపడలేదు. తల్లి పదేపదే చెప్పడంతో చివరకు అయిష్టంగానే ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు.

కొడుకు ట్యూషన్‌కు వెళ్లాడని తల్లి భావించింది. కానీ, కొద్ది నిమిషాలకే వారి అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ పరుగున వచ్చి, పంత్ భవనం పైనుంచి పడిపోయాడని చెప్పాడు. ఈ వార్త విన్న తల్లి వెంటనే కిందకు వెళ్లి చూడగా, తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి షాక్‌కు గురైంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన వాంగ్మూలంలో అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని, అయినప్పటికీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదువుల ఒత్తిడి కారణంగానే బాలుడు ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.


More Telugu News