బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ

  • కనకదుర్గ ఆలయంలో ఘనంగా వారాహి ఉత్సవాలు
  • భాగ్యనగర్ బంగారు బోనం సమర్పించిన కమిటీ సభ్యులు
  • కమిటీ సభ్యులకు ఆలయం వద్ద స్వాగతం పలికిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆలయ ఈవో శీనానాయక్ 
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న తెలంగాణ రాష్ట్రం నుండి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది.

భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు కనకదుర్గమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ నుండి వచ్చిన కమిటీ సభ్యులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దుర్గ టెంపుల్ ఈవో శీనానాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

కమిటీ సభ్యులు బ్రాహ్మణ వీధిలోని దేవస్థాన ఉద్యోగుల కార్యాలయం నుండి డప్పు కళాకారుల నృత్యాల నడుమ ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం చూపించిన అనంతరం మల్లికార్జున మహామండపంలో దేవస్థాన వైదిక కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి గురునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News