కేటీఆర్ రూ. 10 వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేశారు: గజ్జెల కాంతం

  • రాష్ట్రంలో డ్రగ్స్ సృష్టికర్త కేటీఆరేనన్న కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం
  • వెయ్యి మంది సిబ్బందితో గ్రామస్థాయి వరకు డ్రగ్స్ సరఫరా చేశారని విమర్శ
  • కేసీఆర్, కేటీఆర్‌లను అండమాన్ జైలుకు పంపాలని డిమాండ్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే రాష్ట్రంలో మాదకద్రవ్యాల సంస్కృతికి ఆద్యుడని, ఆయనే తెలంగాణ డ్రగ్స్ సృష్టికర్త అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. గత పదేళ్లలో కేటీఆర్ సుమారు రూ.10 వేల కోట్ల విలువైన డ్రగ్స్ వ్యాపారం చేశారని గజ్జెల కాంతం ఆరోపించారు. వెయ్యి మంది సిబ్బందిని నియమించుకుని రాష్ట్రంలోని ప్రతీ మండలానికి, గ్రామానికి డ్రగ్స్ సరఫరా చేశారని విమర్శించారు. 

హైదరాబాద్‌లోని కళాశాల విద్యార్థులతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని వారిని డ్రగ్స్‌కు బానిసలుగా మార్చారని అన్నారు. 2014కు ముందు తెలంగాణలో డ్రగ్స్ అనే మాటే వినిపించలేదని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే ఆయన డైరెక్షన్‌లో కేటీఆర్ ఈ దందాను నడిపారని ఆరోపించారు. సినీ పరిశ్రమలోకి వచ్చే కొత్త నటీనటులకు డ్రగ్స్ అలవాటు చేసి ఆ తర్వాత వారిపై కేసులు పెట్టించారని అన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌లు రజాకార్ల కంటే దుర్మార్గులని, వారిని అండమాన్ జైలుకు పంపాలని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ఉక్కుపాదం మోపుతున్నారని గజ్జెల కాంతం ప్రశంసించారు. 


More Telugu News