భారత్‌పై చైనా ఎత్తుగడ! బీజింగ్ నుంచి ఆగిపోయిన స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్ సరఫరా

China Stops Specialty Fertilizers Export to India
షార్ట్స్‌లో చూడండి
గత రెండు నెలలుగా చైనా నుంచి భారత్‌కు ప్రత్యేక ఎరువుల (స్పెషాలిటీ ఫెర్టిలైజర్స్) ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే, బీజింగ్ ఇతర దేశాలకు మాత్రం ఈ ఎరువులను యథావిధిగా సరఫరా చేస్తుండటం గమనార్హం. పండ్లు, కూరగాయలు వంటి వాణిజ్య పంటలతో పాటు ఇతర పంటల్లో దిగుబడిని గణనీయంగా పెంచడంలో ఈ ప్రత్యేక ఎరువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పరిణామం భారతీయ వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ రకం ఎరువులను ఎగుమతి చేయాలంటే సంబంధిత ఫ్యాక్టరీల నుంచి వచ్చే షిప్‌మెంట్లను చైనా అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే, భారత్‌కు రావాల్సిన షిప్‌మెంట్లను మాత్రం అధికారులు తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుస్తోంది. దీని ద్వారా, అధికారికంగా ఎలాంటి నిషేధం విధించకుండానే ఎగుమతులను అడ్డుకోవడానికి చైనా ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం.

మొక్కలు, చెట్లకు భూమి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన పోషకాలను అందించి, అధిక ఫలసాయం సాధించడానికి ఈ ప్రత్యేక ఎరువులను ఉపయోగిస్తారు. వీటిలో అనేక రకాలు అందుబాటులో ఉన్నాయి. భారత్‌లో ఈ తరహా ఎరువులను పెద్ద మొత్తంలో తయారు చేసుకునే సామర్థ్యం ప్రస్తుతం పరిమితంగానే ఉంది. కొన్ని సంస్థలు చిన్న మొత్తాల్లో స్థానికంగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, ఆర్థికంగా అవి అంత లాభదాయకంగా లేవు. మన దేశం వినియోగించే ప్రత్యేక ఎరువుల్లో దాదాపు 80 శాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి.

గత నాలుగైదేళ్లుగా చైనా ఈ సరఫరాలను నియంత్రిస్తూ వస్తోందని, ఈసారి మాత్రం పూర్తిగా నిలిపివేయడం ఆందోళనకరమని సోలబుల్ ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజిబ్ చక్రబర్తి తెలిపారు. సాధారణంగా జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారత్ సుమారు 1,50,000 నుంచి 1,60,000 టన్నుల ప్రత్యేక ఎరువులను దిగుమతి చేసుకుంటుందని గణాంకాలు చెబుతున్నాయి.

భూసారాన్ని కాపాడుతూ, పంట దిగుబడిని పెంచడానికి రైతులు వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. దేశీయంగా ఈ రంగంలో దీపక్ ఫర్టిలైజర్స్, ప్రదీప్ ఫర్టిలైజర్స్, నాగార్జున ఫర్టిలైజర్స్ వంటి కంపెనీలు ప్రధానంగా వ్యాపారం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఈ ఎరువుల కోసం పశ్చిమాసియా, ఐరోపా దేశాల్లోని ఉత్పత్తిదారుల వైపు చూడాల్సిన అవసరం ఏర్పడింది.

గత ఐదేళ్లుగా భారత్-చైనా మధ్య నెలకొన్న దౌత్యపరమైన విభేదాలు, అలాగే పాకిస్థాన్‌తో చైనా సంబంధాలు బలపడటం వంటి అంశాలు ఈ పరిణామాలకు కారణంగా భావిస్తున్నారు. ఇప్పటికే చైనా రేర్ ఎర్త్ మాగ్నెటిక్స్ వంటి కీలక ముడిసరుకుల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. తాజా పరిణామం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.
Go Back to Shorts
China
Specialty Fertilizers
Fertilizers Export
Agriculture
India China Trade

More Telugu News