అలకనంద నదిలో పడ్డ మినీ బస్సు.. పదిమంది గల్లంతు.. వీడియో ఇదిగో!

  • ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. ఒకరి మృతి..
  • కొండపైకి వెళ్తుండగా అదుపుతప్పిన వాహనం
  • సహాయక చర్యల్లో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
  • క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన అధికారులు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు మరణించగా, పది మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయి. స్థానికులు మానవహారంగా ఏర్పడి గాయపడిన ప్రయాణికులను కొండపైకి చేర్చారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బస్సు కొండ పైకి వెళ్తున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నదిలో నుంచి వెలికితీసిన క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతూ మృతిచెందారు.

నదిలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం వేచి చూడాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


More Telugu News