భారత్-పాక్ క్రికెటర్ల ఆలింగనం.. కౌంటీ మ్యాచ్‌లో అరుదైన దృశ్యం!

  • కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఇషాన్ కిషన్, మొహమ్మద్ అబ్బాస్ జంటగా వికెట్
  • వికెట్ తీశాక ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న భారత్, పాక్ ఆటగాళ్లు
  • యార్క్‌షైర్‌పై అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకం
  • నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతున్న కిషన్, అబ్బాస్
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. భారత జట్టు వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్, పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ అబ్బాస్ కలిసి ఒక వికెట్‌ను సాధించి, మైదానంలో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ, ఈ సంఘటన క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. 

నాటింగ్‌హామ్‌షైర్, యార్క్‌షైర్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. పాకిస్థాన్ పేసర్ మొహమ్మద్ అబ్బాస్ వేసిన ఒక లెంగ్త్ బంతిని యార్క్‌షైర్ ఓపెనర్ ఆడమ్ లిత్ ఎదుర్కోగా, బంతి బ్యాట్ అంచును తాకింది. వికెట్ల వెనుక ఉన్న ఇషాన్ కిషన్ ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. వికెట్ పడిన వెంటనే అబ్బాస్, కిషన్ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ వీడియోను నాటింగ్‌హామ్‌షైర్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో "ది పర్ఫెక్ట్ స్టార్ట్!" అంటూ పంచుకుంది.

ఇదే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌తోనూ అదరగొట్టాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున తన అరంగేట్ర మ్యాచ్‌లోనే ఇషాన్ కిషన్ అద్భుతమైన అర్ధశతకం సాధించాడు. సోమవారం యార్క్‌షైర్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ డామ్ బెస్, న్యూజిలాండ్ పేసర్ విల్ ఓరూర్కే వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లున్నప్పటికీ కిషన్ తనదైన దూకుడు శైలిలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 98 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 87 పరుగులు చేశాడు. 

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో సమాచారం ప్రకారం, ఇషాన్ కిషన్ రెండు కౌంటీ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ల కోసం నాటింగ్‌హామ్‌షైర్‌తో స్వల్పకాలిక ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో అతను ట్రెంట్ బ్రిడ్జ్‌లో యార్క్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో పాటు, టౌంటన్‌లో సోమర్‌సెట్‌తో జరగబోయే మ్యాచ్‌కు కూడా ఆడ‌నున్నాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆటగాడు కైల్ వెర్రెయిన్ జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌లో ఆడుతున్నందున, అతని స్థానంలో కిషన్ జట్టులోకి వచ్చాడు.


More Telugu News