పాపం ట్రంప్.. పాకిస్థాన్ మిలటరీ చీఫ్‌కు ఆతిథ్యమిచ్చినా.. పాక్ మాత్రం చైనా, రష్యా పాట!

  • ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండించిన పాకిస్థాన్
  • అమెరికా చర్యలకు వ్యతిరేకంగా చైనా, రష్యాలతో కలిసి తీర్మానం!  
  • ఇటీవలే ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ భేటీ.. అయినా మారని వైఖరి
  • ఇరాన్ ఆత్మరక్షణ హక్కుకు పాకిస్థాన్ సంపూర్ణ మద్దతు
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిం మునీర్‌కు శ్వేతసౌధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన లంచ్ వృథా అయింది. ఇరాన్‌పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించిన పాకిస్థాన్.. దాని శత్రుదేశాలైన చైనా, రష్యాలకు వంతపాడింది. వైట్‌హౌస్‌లో లంచ్ తర్వాత అమెరికా, పాక్ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్న ఊహాగానాలకు భిన్నంగా పాక్ ఈ వైఖరి తీసుకోవడం చర్చనీయాంశమైంది.

ఇరాన్ అభ్యర్థన మేరకు అణు కేంద్రాలపై దాడుల అంశంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నేడు అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ "ఇరాన్ అణు సదుపాయాలపై అమెరికా జరిపిన దాడులను ఇస్లామాబాద్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇజ్రాయెల్ ఇప్పటికే అనేక దాడులకు పాల్పడిన నేపథ్యంలో అమెరికా కూడా ఈ దాడుల్లో పాలుపంచుకోవడం ఆందోళనకరం" అని తెలిపారు. తమ మిత్రదేశాలైన చైనా, రష్యాలతో కలిసి పాకిస్థాన్ ఒక ముసాయిదా తీర్మానాన్ని మండలి ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నట్టు ఆయన వెల్లడించారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై జరుగుతున్న దాడులను భద్రతా మండలి నిస్సందేహంగా తిరస్కరించి, ఖండించాలని అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యాల సాధన కోసమే చైనా, రష్యాలతో కలిసి పాకిస్థాన్ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడుతోందని ఆయన తెలిపారు.

ఇజ్రాయెల్ దూకుడును పాకిస్థాన్ తీవ్రంగా, నిస్సందేహంగా ఖండించిందని, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అనుగుణంగా ఇరాన్‌కు ఉన్న స్వాభావికమైన, చట్టబద్ధమైన ఆత్మరక్షణ హక్కుకు పూర్తి మద్దతు ప్రకటించిందని అహ్మద్ ఉద్ఘాటించారు.


More Telugu News