Konda Surekha: ఎమ్మెల్యేలు నాయిని, కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు

Konda Surekha Criticizes MLAs Naini Rajender Reddy and Kadiyam Srihari
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం విలేకరులతో జరిపిన సమావేశంలో ఆమె పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. భద్రకాళి ఆలయ వివాదం నుంచి మొదలుకొని, తన మంత్రి పదవిని లక్ష్యంగా చేసుకుని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అదే సమయంలో గోదావరి పుష్కరాల నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై, తెలంగాణ కేంద్ర మంత్రులపైనా ఆమె విమర్శలు గుప్పించారు.

భద్రకాళి ఆలయం ఎవరి సొత్తు కాదు

ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీరుపై కొండా సురేఖ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "భద్రకాళి ఆలయం ఎవరి సొంత ఆస్తి కాదు. కానీ కొందరు అది తమదే అన్నట్లుగా భావిస్తున్నారు" అంటూ నాయినిని ఉద్దేశించి విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు నాయిని రాజేందర్ రెడ్డి అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. భద్రకాళి అమ్మవారికి ఆగమశాస్త్ర నియమాల ప్రకారమే బోనం సమర్పించాలని నిర్ణయించామని, అయితే అక్కడ జంతుబలులు ఇస్తారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. "అమ్మవారు శాకాహారి అనే విషయం అందరికీ తెలుసు. ఏళ్లుగా అక్కడ పనిచేస్తున్న అర్చకుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. బల్కంపేట దేవాలయం నుంచి బోనం తీసుకొచ్చి భద్రకాళి అమ్మవారికి సమర్పిస్తాం" అని సురేఖ స్పష్టం చేశారు.

కడియం నామోషీ ఫీలవుతున్నారు

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా మంత్రి సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరిని ఉద్దేశించి మాట్లాడుతూ, తాను మంత్రిగా ఉండటం చూసి కడియం నామోషీగా భావిస్తున్నారని అన్నారు. "అందుకే నా మంత్రి పదవి పోతుందని ఆయన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్దకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లి నాపై లేనిపోనివి చెబుతున్నారు" అంటూ సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నాకు అదృష్టం ఉంది కాబట్టి మంత్రి అయ్యాను. ఆయనకు అదృష్టం ఉన్నప్పుడు ఆయన కూడా మంత్రి అయ్యారు. అలాంటప్పుడు నన్ను మంత్రి పదవి నుంచి దిగిపోవాలని అనుకోవడం ఎంతవరకు సమంజసం? నా కుమార్తెకు అదృష్టం లేక ఎమ్మెల్యే కాలేదు. కడియం కుమార్తెకు అదృష్టం ఉంది కాబట్టి ఎంపీ అయ్యింది. అందుకోసం నేను ఆమె ఎంపీ పదవి తీసేయాలని అంటున్నానా?" అని మంత్రి సురేఖ ప్రశ్నించారు.

పుష్కరాలకు నిధులు, కేంద్రంపై విమర్శలు

గోదావరి పుష్కరాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సమాన దృష్టితో చూడాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. పుష్కరాల కోసం కేంద్రం రూ. 200 కోట్లు కేటాయించాలని కోరుతూ లేఖ రాసినట్లు తెలిపారు.

"ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే తెలంగాణలోనే గోదావరి పుష్కరాలు అధికంగా జరుగుతాయి. భద్రాచలంలోని శ్రీరాముని పాదాల నుంచే గోదావరి ప్రవహిస్తుంది, ఇక్కడే పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తాం" అని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపడం తగదని హితవు పలికారు. గోదావరి పుష్కరాల నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో వారు చేతకాని మంత్రులుగా చరిత్రలో నిలిచిపోతారని ఆమె వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Konda Surekha
Konda Surekha comments
Naini Rajender Reddy
Kadiyam Srihari

More Telugu News