బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ టోకరా.. పాత‌బ‌స్తీలో ఢిల్లీ ముఠా దందా

  • బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ ఢిల్లీ ముఠా ప్రచారం
  • రెండు రోజుల నాటు వైద్య శిబిరానికి భారీ స్పందన
  • కులీకుతుబ్‌షాహీ స్టేడియంలో ఒక్కొక్కరి నుంచి రూ.1300 వసూలు
  • సల్మాన్ స్టార్ అలియాస్ సల్మాన్ ఢిల్లీవాలా అనే వ్యక్తి నేతృత్వం
  • రెండు రోజుల పాటు దందా సాగినా పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం
హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా జుట్టు మొలిపిస్తామంటూ ఓ ఢిల్లీ ముఠా ఘరానా మోసానికి పాల్పడింది. బట్టతలతో బాధపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని, కేవలం రెండు రోజుల్లోనే అద్భుత ఫలితాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని నమ్మి శని, ఆదివారాల్లో కులీకుతుబ్‌షాహీ స్టేడియంలో నిర్వహించిన ఈ నాటు వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు.

ఢిల్లీకి చెందిన సల్మాన్ స్టార్ అలియాస్ సల్మాన్ ఢిల్లీవాలా అనే వ్యక్తి ఈ దందాకు సూత్రధారి అని తెలిసింది. ఇతని ఆధ్వర్యంలో స్టేడియంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ముందుగా రిజిస్ట్రేషన్ పేరుతో రూ.700, ఆ తర్వాత తలకు ఏదో నూనె రాసినందుకు రూ.600 చొప్పున, ఒక్కొక్క వ్యక్తి నుంచి మొత్తం రూ.1300 వసూలు చేశారు. క్షణాల్లో జుట్టు సమస్య తీరిపోతుందన్న ఆశతో వందలాది మంది ఈ శిబిరానికి తరలివచ్చి, డబ్బులు చెల్లించారు.

ఆశ్చర్యకరంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగినా స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. సోషల్ మీడియా వేదికగా సాగే ఇలాంటి మోసపూరిత ప్రచారాలను అరికట్టడంలో ఉన్న సవాళ్లను ఈ ఘటన మరోసారి ముందుకు తెచ్చింది. 

కాగా, గ‌తంలో కూడా ఇదే త‌ర‌హాలో ఉప్ప‌ల్‌, పాత‌బ‌స్తీలో స‌ల్మాన్ బృందం బ‌ట్ట‌త‌ల‌పై జ‌ట్టు ఖాయ‌మంటూ హ‌ల్‌చ‌ల్ చేసింది. అయితే, బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పుడు ఉప్ప‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు స్టేడియంలో శిబిరం ఏర్పాటు చేయ‌టం విశేషం. ఈ విష‌యం త‌మ దృష్టికి రాలేద‌ని హుస్సేనిఆలం ఇన్‌స్పెక్ట‌ర్ ఆంజ‌నేయులు తెలిపారు. 

అయితే, ఇలాంటి అనధికారిక వైద్య విధానాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి నియంత్రణ లేకుండా అందించే చికిత్సలు ప్రమాదకరమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News