హైదరాబాద్‌లో హైటెన్షన్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవ దహనం

  • ఎల్బీనగర్‌లో తెల్లవారుజామున విషాదం
  • చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ తీగలు 
  • మృతులు యాచకులని పోలీసుల అనుమానం
హైదరాబాద్‌లో ఈ తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంట ప్రాంతంలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై అకస్మాత్తుగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. 

చింతల్‌కుంటలోని ప్రధాన రహదారి పక్కనున్న ఫుట్‌పాత్‌పై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు నిద్రిస్తున్నారు. ఆదివారం వేకువజామున సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి హైటెన్షన్ విద్యుత్ తీగలు భారీ శబ్దంతో వారిపై తెగిపడ్డాయి. క్షణాల్లో మంటలు చెలరేగి వారు నిద్రలోనే సజీవ దహనమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే ఎల్బీనగర్ పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు వారు యాచకులై ఉండొచ్చని భావిస్తున్నారు. వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. విద్యుత్ తీగలు తెగిపడటానికి గల కారణాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.


More Telugu News