ఇజ్రాయెల్ దాడుల వేళ.. ఇరాన్‌కు ట్రంప్ కీలక సూచన!

  • ఇరాన్ వద్ద అణుబాంబు ఉండరాదని తేల్చిచెప్పిన ట్రంప్
  • దాడులతో సాధించేదేమీ లేదని హితవు
  • మళ్లీ చర్చలు ప్రారంభించాలని అమెరికా ఆశిస్తోందన్న అధ్యక్షుడు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. అణు ఒప్పందంపై ఇరాన్‌కు మరోసారి ప్రతిపాదనలు చేశారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేది ఏమీ లేదని అన్నారు. అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు.

ఇరాన్ అణుబాంబును కలిగి ఉండరాదు

ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న సమయంలో, డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుబాంబును కలిగి ఉండటానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అమెరికా ఆశిస్తోందని తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, "ఇరాన్ అణుబాంబును కలిగి ఉండకూడదు, మేం మళ్లీ చర్చల వేదిక పైకి రావాలని ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం" అని ట్రంప్ అన్నారు.

ఈ దాడుల అనంతరం తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ట్రంప్ మరింత ఘాటుగా స్పందించారు. "ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్‌కు నేను పదేపదే అవకాశాలు ఇచ్చాను. 'దాన్ని పూర్తి చేయండి' అని నేను వారికి అత్యంత కఠినమైన పదజాలంతో చెప్పాను, కానీ వారు ఎంత ప్రయత్నించినా, ఎంత దగ్గరకు వచ్చినా, వారు దానిని పూర్తి చేయలేకపోయారు" అని ఆయన రాసుకొచ్చారు. "ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అత్యంత ప్రాణాంతకమైన సైనిక సామగ్రిని అమెరికా తయారుచేస్తుందని, ఇజ్రాయెల్‌ వద్ద అది చాలా ఉందని, దాన్ని ఎలా ఉపయోగించాలో వారికి బాగా తెలుసు" అని ఇరాన్‌ను హెచ్చరించినట్లు ట్రంప్ గుర్తుచేశారు.

"కఠిన వైఖరి అవలంబించేవారు ధైర్యంగా మాట్లాడారు, కానీ ఏం జరగబోతోందో వారికి తెలియదు. వారంతా ఇప్పుడు మరణించారు. ఇది మరింత దిగజారుతుంది!" అని ఆయన హెచ్చరించారు. "ఒప్పందం చేసుకోండి, ఆలస్యం కాకముందే దాన్ని పూర్తి చేయండి" అని ఇరాన్‌కు ట్రంప్ సూచించారు.


More Telugu News