అహ్మదాబాద్ విమాన ప్రమాదం: మౌనం పాటించిన టీమిండియా, ఆసీస్, సఫారీ క్రికెటర్లు

  • అహ్మదాబాద్ వద్ద కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం
  • టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదం, 265 మంది దుర్మరణం
  • డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్ల నివాళి
  • నల్ల బ్యాడ్జీలు ధరించి, ఒక నిమిషం మౌనం పాటించిన క్రికెటర్లు
  • ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా మౌనం పాటించిన వైనం
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ సందర్భంగా క్రికెటర్లు అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతులకు నివాళులు అర్పించారు. శుక్రవారం మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లు ఒక నిమిషం మౌనం పాటించారు. సంతాప సూచకంగా నల్ల బ్యాండ్లను ధరించి మైదానంలోకి దిగారు. అంపైర్లు కూడా నల్ల బ్యాండ్లు ధరించారు.

అటు, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లు కూడా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు విమాన ప్రమాద మృతులకు నివాళిగా మౌనం పాటించారు. చేతులకు నల్లని ఆర్మ్ బ్యాండ్స్ ధరించారు.

గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటన అహ్మదాబాద్‌లోని మేఘాని ప్రాంతంలో చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, పది మంది క్యాబిన్ సిబ్బందితో సహా మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. 


More Telugu News