Acham Naidu: దమ్ముంటే అసెంబ్లీకి రా జగన్... తేల్చుకుందాం: మంత్రి అచ్చెన్నాయుడు సవాల్

Acham Naidu Challenges Jagan to Assembly Debate
  • అసెంబ్లీకి వచ్చి చర్చించాలని జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్
  • ప్రజా సమస్యలపై చర్చ వీధుల్లో కాదు సభలోనే జరగాలని వ్యాఖ్యలు
  • ప్యాలెస్‌లకు పరిమితమై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శ
  • తమ ప్రభుత్వం పారదర్శక చర్చకు సిద్ధంగా ఉందని స్పష్టీకరణ
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సవాల్ విసిరారు. బయట ఉండి నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సింది అసెంబ్లీలో అని, వీధుల్లో కాదని హితవు పలికారు. 

"జగన్ రెడ్డి కి నా సవాల్! బయటి రోడ్లపైన, కేసుల మాటున జైలు ఆవరణలో, లేక ప్యాలెస్‌లలో కూర్చుని అసంబద్ధమైన ఆరోపణలు చేయడం, నిరాధారమైన గందరగోళపు ప్రచారాలు సృష్టించడం మీ విధ్వంసక సిద్ధాంతం కావచ్చు. కానీ, ప్రజలు ఎన్నుకున్న మాకు చట్టంపై, రాజ్యాంగంపై, ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తి గౌరవం ఉంది. మాకు 'గుండాయిజం' తెలియదు... దోపిడీలు, దొంగతనాల చరిత్ర లేదు... అక్రమ సంపాదన, అడ్డగోలు కేసుల సంస్కృతి మాకు అలవాటు లేదు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వంలో మాకు తెలిసింది కేవలం సుపరిపాలన, అభివృద్ధి, మరియు ప్రజా సమస్యలపై పారదర్శక చర్చ. 

మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే... ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల సమస్యలపై మా ప్రభుత్వంతో నిజాయతీగా చర్చించే చిత్తశుద్ధి ఉంటే... అసెంబ్లీలో అడుగు పెట్టండి! అక్కడే చర్చిద్దాం! అక్కడే తేల్చుకుందాం! ప్రజా సమస్యలకు అసెంబ్లీ వేదిక కావాలి, వీధులు కాదు! 

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వకపోయినా కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. మీ నాయకులను అదుపులో ఉంచలేక, పదేపదే అరాచకానికి పాల్పడాలని వారిని ప్రేరేపిస్తున్నారు. మీ నేతలు చేస్తున్న అసంబద్ధ విమర్శలకు అసెంబ్లీలో జవాబు చెప్పగలరా? గత ఐదేళ్ల నీ అసమర్థ పాలనలో ప్రజాధనాన్ని, సమయాన్ని వృథా చేసిన మీ నేతలు నేడు కూటమి ప్రభుత్వంపై చేస్తున్న అవినీతి ఆరోపణలు, అసత్య ప్రచారాలకు ప్రజలకు జవాబు చెప్పే ధైర్యం మీకు ఉందా? చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉంది. చర్చకు రండి!" అని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.
Acham Naidu
Jagan Mohan Reddy
Andhra Pradesh Assembly
AP Politics
YS Jagan
Chandrababu Naidu
TDP
YSRCP
Political Challenge
AP Government

More Telugu News