Vladimir Putin: పుతిన్ విందులో ఖరీదైన 'గుచ్చి' పుట్టగొడుగులు... కేజీ రూ.40 వేలు... ఎందుకంత స్పెషల్?

Gucchi Mushrooms Costing 40000 Served to Putin at Indian Banquet
  • రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గౌరవార్థం రాష్ట్రపతి భవన్‌లో విందు
  • పూర్తి శాఖాహార మెనూలో ప్రత్యేక ఆకర్షణగా గుచ్చి పుట్టగొడుగులు
  • వాణిజ్యపరంగా వీటిని సాగు చేయడం దాదాపు అసాధ్యం
భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. ఈ విందులో వడ్డించిన వంటకాలన్నీ పూర్తి శాఖాహారమైనవే కావడం విశేషం. అయితే, ఈ మెనూలో 'గుచ్చి దూన్ చేతిన్' అనే కశ్మీరీ వంటకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని అత్యంత ఖరీదైన, అరుదైన 'గుచ్చి' పుట్టగొడుగులతో తయారు చేస్తారు. మార్కెట్‌లో వీటి ధర కేజీకి సుమారు రూ. 35,000 నుంచి రూ. 40,000 వరకు ఉంటుంది.

గుచ్చి పుట్టగొడుగులు చాలా అరుదైనవి. ఇవి కేవలం జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి. వీటిని వాణిజ్యపరంగా సాగు చేయడం దాదాపు అసాధ్యం. మంచు కరిగిన తర్వాత వసంతకాలంలో, ప్రత్యేకమైన నేల, ఉష్ణోగ్రత పరిస్థితుల్లో మాత్రమే ఇవి సహజంగా పెరుగుతాయి. ఒక్కోసారి అడవుల్లో కార్చిచ్చుల తర్వాత కూడా ఇవి మొలకెత్తుతాయి.

ఈ పుట్టగొడుగులను సేకరించడం కూడా చాలా కష్టమైన పని. స్థానికులు కొండ ప్రాంతాల్లోని కఠినమైన భూభాగంలో వారాలపాటు గాలించి, ఎంతో శ్రమించి వీటిని సేకరిస్తారు. కేవలం కొద్ది వారాలు మాత్రమే లభించడం, డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వీటికి అంత ధర పలుకుతుంది. ఒక్కోసారి లభ్యతను బట్టి కేజీ ధర రూ. 50,000 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు.

గుచ్చి పుట్టగొడుగులు వాటి ప్రత్యేకమైన ఉమామి రుచి, మాంసాన్ని పోలిన ఆకృతికి ప్రసిద్ధి. అందుకే శాఖాహార వంటకాల్లో వీటికి ప్రత్యేక స్థానం ఉంది. వీటితో గుచ్చి పులావ్, యఖ్ని, రోగన్‌జోష్ వంటి సాంప్రదాయ కశ్మీరీ వంటకాలను కూడా తయారు చేస్తారు. పుతిన్‌కు ఇచ్చిన శాఖాహార విందులో ఈ అరుదైన, రుచికరమైన వంటకాన్ని చేర్చడం ద్వారా భారతీయ వంటకాల వైవిధ్యాన్ని చాటిచెప్పారు.
Vladimir Putin
Putin India visit
Droupadi Murmu
Gucchi mushrooms
Kashmiri cuisine
Gucchi Doon Chetin
expensive mushrooms
Indian vegetarian food
rare mushrooms
Himalayan mushrooms

More Telugu News