కూలిన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు... బతికే అవకాశాలు స్వల్పం!

  • అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది
  • లండన్ గ్యాట్విక్‌కు బయలుదేరిన ఏఐ171 విమానానికి ప్రమాదం
  • టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే దుర్ఘటన
  • విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది
  • క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలింపు, సహాయక చర్యలు కొనసాగింపు
  • ప్రయాణికుల సమాచారం కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక హాట్‌లైన్ ఏర్పాటు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ171, అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు లండన్ గ్యాట్విక్‌కు టేకాఫ్ అయింది. అయితే, గాల్లోకి ఎగిరిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే విమానం కుప్పకూలింది. 

ప్రమాద వార్త తెలియగానే సహాయక బృందాలు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం కూలిపోతున్న దృశ్యాలు కొన్ని ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. అవి చూపరులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఈ దుర్ఘటనపై ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారు" అని ఎయిర్ ఇండియా తెలిపింది. "గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నాం" అని పేర్కొంది.

ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక హాట్‌లైన్ నంబర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. "మరింత సమాచారం అందించేందుకు 1800 5691 444 అనే ప్రత్యేక ప్యాసింజర్ హాట్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశాము," అని పూర్తిస్థాయి సేవలందించే ఈ విమానయాన సంస్థ తన ప్రకటనలో జోడించింది.

ఈ ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి అన్ని విమాన సర్వీసులను తదుపరి ప్రకటన వెలువడే వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.

కాగా, ప్రమాదం జరిగిన తీరు చూస్తే, విమానంలోని వారు బతికి బయటపడే అవకాశాలు స్వల్పం అని తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.


More Telugu News